Home Andhra Pradesh జగన్ మీద అంత కసి దేనికి ఉండవల్లికి?

జగన్ మీద అంత కసి దేనికి ఉండవల్లికి?

రాష్ట్రంలోని ప్రముఖ మేధావులు ఎవరున్నారా అని ఒకసారి వెతికితే ప్రముఖంగా కనిపించే వినిపించే పేరు మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ దే ఉంటుంది.  ఉండవల్లి, జయప్రకాశ్ నారాయణ్, ఐవైఆర్ కృష్ణారావు  లాంటి మేధావులు బహిరంగంగా  ఏదైనా ఒక మాట మాట్లాడితే దానికో పరిగణన తప్పకుండా ఉంటుంది.  కొందరైనా వారి వ్యాఖ్యల గూర్చి ఆలోచిస్తారు.  అలాంటి ముఖ్యమైన వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ ఎందుకనో ఈ మధ్య తరచుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుని పడుతున్నారు. 
 
Ys Jagan And Vundavalli Arun Kumar
YS Jagan and Vundavalli Arun Kumar

అసూయాపూరిత విమర్శలా? 

నిన్న ఆయన రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఒక పత్రికా సమావేశంలో జగన్ ని దుయ్యబట్టినట్లు, సిబిఐ కేసులకు భయపడుతున్నట్లు, చేతకానివాడన్నట్లు, కేంద్రానికి లొంగిపోయినట్లు, పోలవరం కోసం పోరాడటం లేదన్నట్లు, అధికారం శాశ్వతం అని భ్రమపడుతున్నట్లు, నవరత్నాలు ఓట్లు తెచ్చిపెట్టవన్నట్లు  కటువైన వ్యాఖ్యలు చేసినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక ఒక రిపోర్టును  క్యారీ చేసింది.  ఆ రిపోర్టులో వాస్తవావాస్తవాలు ఏమిటో తెలియవు కానీ, అవి నిజమైతే మాత్రం ఉండవల్లి విమర్శలు ఏమాత్రం ఔచిత్యవంతంగా లేవని భావించాలి.  

చంద్రబాబు పాలనలో పెగలని నోరు 

నిజానికి ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు.  కాంగ్రెస్ పక్షాన ఆయన జగన్ ను విమర్శిస్తున్నారనుకుంటే ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేరు.  అయినప్పటికీ ఒక మేధావి హోదాలో జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తుంటారు.  వాస్తవం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కు తీవ్రమైన అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయే.  ఆ పాపానికి ఆ పార్టీ ఫలితాన్ని అనుభవించింది.  రాష్ట్రం విడిపోయాక ఐదేళ్లు అధికారాన్ని వెలగబెట్టిన చంద్రబాబు హయాంలో ఏనాడైనా ఉండవల్లి ఈ విధంగా విమర్శించారా?  కేంద్రంతో ఎందుకు పోరాడటం లేదంటూ నిలదీశారా?  తనమీదున్న ఓటుకు నోటు, అవినీతి కేసులకు భయపడి చంద్రబాబు కేంద్రానికి లొంగిపోయారని ఏ పత్రికాసమావేశంలో అయినా కడిగేశారా?  ఎందుకు ఇప్పుడు జగన్ మీద అంత ఆక్రోశం? 

మోడీని ఎందుకు నిలదీయలేకపోతున్నారు? 

మనదేశంలో కాంగ్రెస్ పార్టీ పాలన వరుసగా మూడు దశాబ్దాలకు పైగా కొనసాగింది.  పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టులు మూడున్నర దశాబ్దాలు పాలించారు.  ఒడిశాలో ఇరవై ఏళ్లుగా నవీన్ పట్నాయక్ ఏలుతున్నారు.  ప్రజారంజకంగా పరిపాలిస్తే ఎవరు ఎన్నాళ్లయినా పాలించవచ్చు.  ప్రజా విశ్వాసం కోల్పోతే అయిదేళ్లకే దిగిపోవాల్సి రావచ్చు.  ఇది ప్రజాస్వామ్యం.  జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర మాత్రమే అయింది.  ఇంకా మూడున్నరేళ్ల కాలం ఉన్నది.  అప్పుడే అధికారం శాశ్వతం కాదని జగన్మోహన్ రెడ్డికి శాపనార్ధాలు పెట్టాలా?  ఎవరికీ తెలుసు?  ఉండవల్లి ఏమీ జనాభిప్రాయానికి ప్రతినిధి కాదు.  మొన్నటి జగన్మోహన్ రెడ్డి గెలుపులో ఉండవల్లి పాత్ర ఏమీ లేదు.  జగన్ అధికారం ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలుస్తుంది?   రాజధాని పేరుతో వేలాది ఎకరాల రైతుల భూములను చంద్రబాబు బలవంతంగా కబ్జా చేసి గాలిమేడలు కడుతున్నప్పుడు, నవనగరాలు నిర్మిస్తామని కోతలు కోస్తున్నప్పుడు, ప్రజలను నిలువునా మోసం చేస్తున్నప్పుడు, వేలాది ఎకరాలను అస్మదీయులకు అక్రమంగా కట్టబెడుతున్నప్పుడు  ఏనాడైనా అది తప్పని  చంద్రబాబును హెచ్చరించారా?   ఇవాళ జగన్ పాలనలో నిలదొక్కుకుంటున్న సమయంలో ఎందుకీ విమర్శలు?

నవరత్నాలు గెలిపించలేవా? 

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి దోహదం చేసిన అనేక కారణాల్లో ఆయన ఇచ్చిన నవరత్నాలు హామీ కూడా ఒకటి.  నిజానికి ఆ నవరత్నాలు అమలు చెయ్యడం సాధ్యం కాదని నాబోటివారు కూడా నమ్మారు.  కానీ, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే జగన్మోహన్ రెడ్డి వాటిని సునాయాసంగా అమలు చేశారు.  చంద్రబాబు హయాంలో “డబ్బులు లేవు” అని ప్రతిరోజూ బీద అరుపులు అరుస్తూండేవాడు.  జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా “డబ్బులు లేవు” అనే మాటను ఉచ్చరించడం విన్నామా?  
 

జగన్ భయపడుతున్నాడంటే ఉండవల్లి ఇంట్లోవారైనా నమ్ముతారా? 

సిబిఐ కేసులకు జగన్ భయపడుతున్నాడని మరొక అర్ధం పర్ధం లేని ఆరోపణ చేశారు ఉండవల్లి.  సిబిఐ కేసులకు భయపడేవాడైతే ఆయన ఏనాడో చంద్రబాబు మాదిరిగా చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకునేవారు.  కేసీఆర్ కు భయపడి చంద్రబాబు రాత్రికి రాత్రే ఉమ్మడి రాజధాని హక్కును వదిలేసుకొని అమరావతి పారిపోయినట్లు సోనియాకు భయపడి ఢిల్లీ వెళ్లి ఆమె పాదాలను చుట్టేసుకునేవాడు.  తన మీద తనకు నమ్మకం, తన నిజాయితీ మీద తనకు విశ్వాసం ఉన్నది కాబట్టే పదహారు నెలల పాటు జైల్లో అక్రమంగా బంధించినప్పటికీ ఏమాత్రం చలించకుండా “”బోనులో బంధించినా సింహం గర్జించక మానదు””  అన్నట్లు సోనియాతో తెగతెంపులు చేసుకుని తన పౌరుషం ఏమిటో  నిరూపించారు.  ఈనాటికీ కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తున్నారు.  రాజశేఖరెడ్డి కుటుంబంతో సుదీర్ఘమైన అనుబంధం ఉన్నప్పటికీ జగన్ నైజం ఉండవల్లికి తెలియకపోవడం ఆశ్చర్యం.   

ఉండవల్లి చూపించిన విశ్వాసం ఏమిటి? 

రాజశేఖరరెడ్డి ప్రోత్సాహంతో రెండు సార్లు ఎంపీగా గెలిచిన ఉండవల్లి వైఎస్ మరణం తరువాత ఏనాడైనా జగన్ పట్ల ఆ కృతజ్ఞతాభావాన్ని చూపించారా?  ఏనాడైనా జగన్ వెన్ను తట్టారా?   “మేము అండగా ఉంటామని”  మాటమాత్రమైనా జగన్ ను ఓదార్చారా?   సోనియాకు భయపడి వైఎస్ కుటంబానికి దూరంగా మసలుతూ ఎంపీ  పదవిని కాపాడుకున్న ఉండవల్లి…జగన్ భయపడుతున్నాడని వేళాకోళం చెయ్యడం ఎంత హాస్యాస్పదం?  

జగన్మోహన్ రెడ్డికి తెలియదా?  

పోలవరం ప్రాజెక్ట్ ఈనాటిదా?  యాభై ఏళ్ళనాటిది.  ఈ యాభై ఏళ్లకాలంలో ముప్ఫయి సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉన్నాయి.  రాజశేఖర రెడ్డి ప్రారంభించేంతవరకు అంతకుముందున్న కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు ఏమి చేశాయి?  ఎందుకు ఆ ప్రభుత్వాలు పోలవరాన్ని పూర్తి చేయలేకపోయాయి?  అరవై ఏళ్లుగా వారు చెయ్యలేని కార్యాన్ని ఏడాదిన్నరలో జగన్ పూర్తి చెయ్యలేదని కుత్సిత ఆరోపణలా!  హవ్వ!!   కేంద్రంలో ఎలాంటి ప్రభుత్వం ఉన్నది?  ప్రత్యేక హోదా ఇస్తామని, ప్యాకేజీలు ఇస్తామని వాగ్దానం చేసి ఆంధ్రులను నిలువునా వంచించిన మోడీ ప్రభుత్వం ఉన్నది.  పూర్తి మెజార్టీ ఉందనే అహంకారంతో ఎవరినీ లెక్కచెయ్యకుండా మదించిన ఐరావతంలా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నది.  మోడీతో పెట్టుకున్న చంద్రబాబు గతి ఏమయిందో ఉండవల్లి చూస్తున్నారు కదా?  ఏ కార్యం అయినా సాధించడానికి సామదానభేద దండోపాయాలు ఉన్నాయి అని పెద్దలైన ఉండవల్లికి తెలుసు.  ఏ మార్గంలో కార్యాన్ని సఫలీకృతం చేసుకోవాలో జగన్కు తెలుసు.  ప్రజలు ఆయనకు అధికారాన్ని ఇచ్చారు.  ఆయన పని ఆయన్ను చెయ్యనివ్వండి.  ఉండవల్లి లాంటివారు ధైర్యం ఉంటె మోడీ మీద ధ్వజం ఎత్తండి.  పదేళ్ల పార్లమెంటేరియన్ గా అనుభవం కలిగిన, న్యాయశాస్త్రంలో సంపూర్ణ పరిజ్ణానం కలిగిన ఉండవల్లి అరుణ్ సుప్రీమ్  ఢిల్లీలో వివిధ పార్టీలను కూడగట్టి మోడీ కాలర్ పట్టుకుని ఆంధ్రప్రదేశ్ కు చేసిన మోసాన్ని గుర్తు చెయ్యండి.  సుప్రీమ్ కోర్టులో పిటీషన్లు వేసి పోరాటం చెయ్యండి.  ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఉండవల్లికి ఆమాత్రం బాధ్యత లేదా?  ఊరికే మూడు నెలలకోసారి మీడియా ముందు జగన్ మోహన్ ను విమర్శించి క్షుద్ర పచ్చ మీడియాలో కవరేజ్ తెచ్చుకుంటే మీ బాధ్యత తీరిపోతుందా?    

జగన్ వీరోచిత తత్త్వం అందరికీ తెలుసు 

జగన్మోహన్ రెడ్డి ఈనాటి అధికారం వెన్నుపోటుతోనో, వారసత్వంతోనో సునాయాసంగా వచ్చింది కాదు.  ఉండవల్లి లాంటి మేధావులు, తలపండిన మహా నేతలు కూడా ఎవరిని చూసి పంచెలు తడుపుకుంటారో అలాంటి సోనియా గాంధీనే నువ్వెంత నీ అధికారం ఎంత అని ఛీకొట్టి బయటకొచ్చి సొంత పార్టీ పెట్టుకున్న మగధీరుడు.  కటకటాలను కనకాంబరాలుగా భావించి, ఎంత బెదిరించినా, హింసించినా సరకు చెయ్యకుండా ఎదిరించిన పౌరుషవంతుడు.   మూడున్నరవేల కిలోమీటర్ల పాదయాత్రతో ప్రజల కష్టనష్టాలను కళ్లారా చూసి వారిని ఓదార్చి వారి గుండెల్లో కొలువైన ప్రతిభావంతుడు.  ఒంటిచేత్తో ఎనభై శాతం అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుని నియంతృత్వ, అవినీతి పాలనను తరిమేసి పదవిని అధిరోహించిన  విక్రమార్కుడు.  అలాంటివారిని హేళన చెయ్యడం, నీతులు చెప్పడం, బెదిరించడం, హెచ్చరించడం ఉండవల్లి లాంటి మేధావులకు శోభస్కరం కాదు.  మనసుంటే మంచి సలహాలు ఇస్తూ వెన్ను తట్టండి.  మనసు రాకపోతే మౌనంగా ఉండటం వారిపట్ల గౌరవాన్ని ఇనుమడింపజేస్తుంది.  
 
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు 
- Advertisement -

Related Posts

షాకింగ్ : జైలుకి వెళ్లబోతోన్న టాలీవుడ్ యంగ్ హీరో ??

టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే కెరీర్ లో సెటిలవబోతున్న ఒక యంగ్ హీరో జైలుకి వెళ్ళే అవకాశాలున్నాయని ఫిల్మ్ నగర్ లో అలాగే సోషల్ మీడియాలోనూ న్యుస్ వైరల్ గా మారింది. సినిమాలలో నటించాలని...

ఆర్ఆర్ఆర్ కి రాజమౌళి ఒకే ఒక్క ఫోటో తో ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చాడు..!

ఆర్ఆర్ఆర్ టాలీవుడ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా. లాక్ డౌన్ తర్వాత శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా తాజా అప్ డేట్ ను ఇచ్చారు రాజమౌళి బృందం. సంక్రాంతి...

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్.. ఆ అవసరం ఎవరికి.?

వున్నపళంగా తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాజీనామా చేసెయ్యాలేమో.. ఆ స్థానంలో కేటీఆర్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోక తప్పదేమో. ఇదీ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న తాజా చర్చ. పలువురు మంత్రులు,...

ఇలా ముద్దులు పెట్టేస్తోందేంటి?.. రెచ్చగొడుతోన్న పాయల్

పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎంత బోల్డ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకుంది. ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్ క్రేజీ...

Latest News