చంద్రబాబునాయుడులో రోజురోజుకు అసహనం పెరిగిపోతోంది. పెరిగిపోతున్న అసహనం దేనికి సంకేతం ? విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై చంద్రబాబు చాలా అసహనంగా కనబడుతున్నారు. గడచిన ఆరు రోజులుగా జగన్ పై హత్యాయత్నం అంశాన్ని చంద్రబాబు కనీసం పదిసార్లైనా ప్రస్తావించి ఉంటారు.
నిజానికి జగన్ పై హత్యాయత్నం ఘటనను ఇన్నిసార్లు ప్రస్తావించాల్సిన అవసరం చంద్రబాబుకు ఏంటో అర్ధం కావటం లేదు. అదే విధంగా మంత్రులకు టైం టేబుల్ ఇచ్చి మరీ జగన్ పైన, వైసిపిపైన బురద చల్లిస్తున్నారు. ఎవరు ఎక్కడ మాట్లాడినా ఒకటే. ఘటనపై టిడిపిని నిలదీస్తేనో, లేకపోతే ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలపై ప్రశ్నిస్తేనో మీడియాపై మండిపోతున్నారు.
జగన్ పై జరిగిన దాడిపై సిట్ తో విచారణ వేసిన తర్వాత దానికిపై చంద్రబాబు, మంత్రులు అన్నిసార్లు మాట్లాడాల్సిన అసవరం లేదు. ప్రశ్నలడిగిన మీడియాపై మండిపడాల్సిన అవసరం లేదు. అయినా ఎందుకలా విరుచుకుపడుతున్నారు ? కారణం ఒకటే కనబడుతోంది. జగన్ పై హత్యాయత్నం ఘటనలో చంద్రబాబు, మంత్రుల వాదనలో పస లేదని తేలిపోతోంది. అందరి అనుమానాలు టిడిపి నేతలవైపే మళ్ళుతోంది. చంద్రబాబు, మంత్రులు మాట్లాడేకొద్దీ ప్రభుత్వ వైఫల్యమే స్పష్టంగా బయటపడుతోంది.
ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరగటమంటే అది ప్రభుత్వ వైఫల్యమనటంలో సందేహం లేదు. ఘటన జరిగినపుడు జగన్ ను పరామర్శించాల్సిన చంద్రబాబు అందుకు విరుద్ధంగా మాట్లాడుతుండటంతో జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. అన్నీ పార్టీల నేతలు ఘటనను ఖండించటం చూస్తుంటే చంద్రబాబులో అసహనం పెరిగిపోతోంది. దానికితోడు నిందితుడిని అదుపులోకి తీసుకున్న సిట్ విచారణ అధికారి కూడా నిందితుడు అసలు నోరే మెదపటం లేదని చెప్పటం కూడా పలు అనుమానాలను పెంచేస్తోంది.