విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్రం మరోమారు స్పష్టంగా చెప్పేసింది. ఈ మేరకు కేంద్రం, పార్లమెంటు సాక్షిగా ఇంకోసారి లిఖిత పూర్వక సమాధానమిచ్చింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలకు చెందిన నేతలు ఢిల్లీకి వెళ్ళి ఆందోళన చేస్తున్న విషయం విదితమే. ఈ ఉద్యమానికి వైఎస్సార్సీపీ సహా వివిధ రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగనివ్వబోమని తెగేసి చెప్పారు. కానీ, అంతలోనే పార్లమెంటు సాక్షిగా కేంద్రం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మరింత స్పష్టతనిచ్చింది. ప్రైవేటీకరణ మొదలైందనీ, ఆగే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది.
మరెందుకు, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమమంటూ రాజకీయ డ్రామా నడుస్తున్నట్లు.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోందిప్పుడు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు నిజంగానే అనుకుంటే, ఈపాటికే ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళి వుండాలి. కేంద్రానికి అవసరమైన సందర్భంలో అవసరమైన విధంగా సహకరిస్తూ వస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సైతం కేంద్రాన్ని ఈ విషయంలో నిలదీయలేకపోతోంది. జనసేన ఎటూ బీజేపీకి మిత్రపక్షం.. ఆ పార్టీ అసలు ఈ వ్యవహారంపై ఏ విధానాన్ని అనుసరిస్తోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. మొత్తంగా చూస్తే, విశాఖ ఉక్కు పరిశ్రమ విషయమై రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకీ చిత్తశుద్ధి వున్నట్లు కనిపించడంలేదు. ఇదొక్కటే కాదు, రాష్ట్రానికి సంబంధించిన అన్ని కీలక విషయాల్లోనూ, రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు విఫలమవుతుండడం వల్లే, కేంద్రం ఆడిందే ఆట అవుతోందన్నది నిర్వివాదాంశం.