టిడిపి ఎందుకింత చవకబారుగా వ్యవహరిస్తోంది ?

అసలే పార్టీ తరపున గెలిచిందే 23 మంది ఎంఎల్ఏలు. దానికి తోడు చేసిన తప్పులు వెంటాడుతుండటంతో అసెంబ్లీలో వైసిపి దాటికి చంద్రబాబానాయుడు అండ్ కో నోరెత్తలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి అండ్ కో అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానలు చెప్పలేక నోరిప్పలేకపోతున్నారు చంద్రబాబు. అందుకే అవసరం లేకపోయినా సభలో గోల చేయటమనే చవకబారు వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

వైసిపి వల్ల తమకు ఎప్పుడు ఇబ్బందులు వస్తాయని అనుకున్నా వెంటనే అసెంబ్లీలో టిడిపి ఎంఎల్ఏలు గోల మొదలుపెడుతున్నారు. నిజానికి టిడిపి హయాంలో కన్నా అసెంబ్లీ సమావేశాలు ఇపుడే బాగా జరుగుతున్నాయి. టిడిపి హయాంలో అసలు జగన్ కు మైకే ఇచ్చేవార కాదు. కానీ ఇపుడు ప్రభుత్వంపై చంద్రబాబు ఇంతలా బురదచల్లుతున్నారంటే మాట్లాడే అవకాశం ఇస్తున్నట్లే లెక్క కదా ?

తాజాగా అసెంబ్లీలో అధికారపార్టీ కొన్ని బిల్లులు ప్రవేశపెట్టింది.  ఎస్సీ, ఎస్టీ, బిసి, ముస్లింలకు నామినేటెడ్ వర్కుల్లో 50 శాతం పనులు ఇచ్చే బిల్లు, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం కేటాయించే బిల్లు, పరిశ్రమల్లో స్ధానికులకే 75 శాతం ఉద్యోగ, ఉపాధి కల్పించాలనే మరో బిల్లులను వైసిపి ప్రవేశపెట్టింది. వెంటనే టిడిపి సభ్యులు అనవసరంగా గోల మొదలుపెట్టారు.

పోలవరం ప్రాజెక్టులో అవినీతి, విద్యుత్ పిపిఏల్లో అవినీతి లాంటి అనేక అంశాలపై సభలో చర్చ జరుగుతున్నపుడు కూడా టిడిపి ఎంఎల్ఏలు ఇదే విధంగా గోల చేశారు. చంద్రబాబు పక్కన ఎవరు కూర్చోవాలి ? అనే అంశంపై టిడిపి సభ్యులు చివరకు స్పీకర్ తోనే దాదాపు గంటసేపు వాగ్వాదం పెట్టుకున్నారు.  టిడిపి సభ్యులు ఎందుకిలా  చేస్తున్నారంటే వైసిపిని ఎదుర్కోలేమని తెలిసినపుడు, వైసిపి చెప్పే నిజాలు జనాలకు తెలియకూడదని అనుకున్నపుడల్లా సభలో టిడిపి ఇలాగే చవకబారుగా వ్యవహరిస్తోంది.