జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నం ఘటనలో కీలకమైన టిడిపి నేత, ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్షవర్ధన్ చౌదరి అడ్రస్ లేకుండా పోయాడు. హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ విచారణకు హాజరవ్వాల్సిన చౌదరి పత్తా లేకుండా పోయారంటూ జగన్ మీడియా చెబుతోంది. ఎయిర్ పోర్టులో ఫ్యూజన్ ఫుడ్స్ పేరుతో చౌదరి ఓ క్యాంటిన్ నడుపుతున్నారు. ఆ క్యాంటిన్ కూడా టిడిపి పెద్దల వల్లే దక్కించుకున్నాడు. జగన్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ పనిచేసేది కూడా ఆ క్యాంటిన్లోనే. జగన్ ను నిందితుడు పొడిచిన కత్తిని దాచుకున్నది కూడా క్యాంటిన్లోనే. క్యాంటిన్లో కత్తిని నిందితుడు ఎలా దాచుకున్నాడన్నది ఇఫుడు పెద్ద ప్రశ్న. విమానాశ్రయం లోపలకు వచ్చేటపుడు ప్రతీ ఒక్కరినీ క్షుణ్ణంగా చెక్ చేయాల్సిన భద్రతా సిబ్బంది కత్తిని క్యాంటిన్లోకి తెస్తుంటే నిందితుడుని ఎలా వదిలేశారు ?
ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు రావాలంటే క్యాంటిన్ ఓనర్ చౌదరి విచారణకు హాజరవ్వాల్సిందే. ఎందుకంటే విమానాశ్రయంలో విధులు నిర్వహించే భద్రతా అధికారులు చౌదరికి బాగా సన్నిహితులు. ఆ సన్నిహితంతోనే నిందితుడు కత్తిని తెస్తున్నా భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. అంటే నిందితుడు కత్తిని తెస్తున్న లేదా తెచ్చిన విషయం చౌదరితో పాటు భద్రతాధికారులకు కూడా తెలీకుండా ఉండదు. అందుకే జగన్ హత్యాయత్నం కేసులో చౌదరే కీలకమని వైసిపి నేతలు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. అయితే, రాష్ట్రప్రభుత్వం నియమించిన సిట్ విచారణలో పై విషయాలేవీ పట్టించుకోలేదు.
అందుకే హత్యాయత్నం ఘటనలో వాస్తవాలు బయటకు రావాలంటే, సూత్రదారులెవరో తేలాలంటే థర్డ్ పార్టీ విచారణ జరపాల్సిందేనంటూ హైకోర్టుకెక్కారు. జగన్ వాదనలో వాస్తవముందనే కోర్టు కూడా ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది. సరే చంద్రబాబు ఆలోచనలకు భిన్నంగా కోర్టు ఎన్ఐఏ విచారణకు ఆదేశించటంతో స్ధానిక పోలీసులు ఎన్ఐఏ విచారణకు ఏమాత్రం సహకరించటం లేదు. సరే అదో పెద్ద గొడవలేండి. ఆ విషయం కూడా కోర్టు విచారణలో ఉంది. ఇక్కడ విషయం ఏమిటంటే, ఎన్ఐఏ నోటీసిచ్చినా చౌదరి లెక్క చేయకుండా విచారణకు గౌర్హాజరయ్యారంటే చిన్న విషయం కాదు. చౌదరి వెనుక బలమైన నేతలు లేకపోతే ఎన్ఐఏ విచారణకు గైర్హాజరయ్యేంత ధైర్యం చేస్తాడని అనుకునేందుకు లేదు.
ఎన్ఐఏ నోటీసుల ప్రకారం రెండు రోజుల క్రితమే విచారణకు చౌదరి హాజరవ్వాలట. కానీ ఇప్పటికీ హాజరుకాకపోతే ఏమవుతుందో చూడాలి. కేసు వివరాలను పోలీసులు ఇవ్వక, విచారణకు అనుమానితులూ హాజరు కాకపోతే ఎన్ఐఏ తన విచారణను ఏ విధంగా ముందుకు తీసుకెళుతుంది ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న యవ్వారాలు చూస్తుంటే జగన్ పై దాడి కచ్చితంగా హత్యాయత్నమే అనే అనుమానాలు బలపడుతున్నాయి. కాకపోతే హత్యకు కుట్ర చేసిందెవరు అన్నదే తేలాలి. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వైసిపి నేతల ఆరోపిస్తున్నట్లుగా వ్యవహారమంతా చంద్రబాబు లేకపోతే పుత్రరత్నం నారా లోకేష్ చుట్టూనే తిరుగుతోంది.