ఈయన వైసిపి తరపున పోటీ చేస్తే టిడిపికి ఇబ్బందేనట

ఆమధ్య అధికార పార్టీ ఎంపి జేసి దివాకర్ రెడ్డినే సవాలు చేసిన కదిరి ఇన్ స్పెక్టర్ గోరంట్ల మాధవ్ గుర్తున్నారా ? ఆయన ఎక్కడ వైసిపిలో చేరుతారో అని తెలుగుదేశంపార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారట. సిఐ విషయంలో టిడిపి నేతలు ఎందుకంతగా భయపడుతున్నారంటే మాధవ్ కున్న సామాజిక బలం ప్రధాన కారణమట. అంతేకాకుండా పోలీసు అధికారిగా కూడా మాధవ్ కు జిల్లాలో బాగా క్రేజుందట. అటువంటి వ్యక్తి వైసిపిలో చేరి రాబోయే ఎన్నికల్లో హిందుపురం ఎంపిగా పోటీ చేస్తే  గెలవటం కష్టమని టిడిపి నేతలు ఆందోళన పడుతున్నారట.

ఆమధ్య తాడిపత్రి నియోజకవర్గంలో స్వామి ప్రబోధానంద స్వామి మఠం గొడవలతో మాధవ్ వెలుగులోకి వచ్చారు. పోలీసులపై విరుచుకుపడిన జేసి మీదే మాధవ్ డైరెక్టు యాటక్ చేశారు. పోలీసులను నోటికొచ్చినట్లు మాట్లాడితే నాలుక కోసేస్తానంటూ సిఐ చేసిన హెచ్చరిక జిల్లాలో సంచలనమే రేపింది. ఎప్పుడైతే జేసికి మాధవ్ హెచ్చరిక చేశారో వెంటనే వైసిపి నేతల దృష్టిని ఆకర్షించారు. ఇంకేముంది వైసిపి నేతలు వరుసబెట్టి మాధవ్ తో మంతనాలు మొదలుపెట్టేశారు. జిల్లాలో ఇన్చార్జిగా ఉన్న మిథున్ రెడ్డి కూడా మాధవ్ తో నేరుగా మాట్లాడటంపై పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో మాధవ్ ను హిందుపురం ఎంపిగా పోటీ చేయించాలని వైసిపిలోని కీలక నేతలు ప్రయత్నిస్తున్నారట. ఆ విషయంపై సిఐకి తగిన హామీ వచ్చిన కారణంగానే తన ఉద్యోగానికి రాజీనామా చేశారట. మాధవ్ పైనే కీలక నేతలు దృష్టి పెట్టటానికి రెండు కారణాలున్నాయని సమాచారం. మొదటిది ఆయనకున్న కుల బలం. రెండోది మాధవ్ కున్న క్రేజ్. మాధవ్ కురబ కులానికి చెందిన వారట. హిందుపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కురబ, యాదవ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దానికితోడు ఇతర బిసి ఓట్లు కూడా ఎక్కువే. ఇప్పటి వరకూ టిడిపి బిసి నేతలను రంగంలోకి దింపటం ద్వారానే గెలుస్తోంది. సిట్టింగ్ ఎంపి నిమ్మల కిష్టప్ప కూడా బిసినే.

కానిస్టేబుల్ గా డిపార్టుమెంటులో చేరిన దగ్గర నుండి మాధవ్ వ్యవహారశైలి భిన్నంగానే ఉంటోందట. నిబంధనలకు భిన్నంగా నడుచుకోవటమంటే మాధవ్ కు ఏమాత్రం ఇష్టం ఉండదట. రాజకీయాలను అడ్డంపెట్టుకుని, అధికారం ముసుగులో దందాలు చేసే వాళ్ళ విషయంలో మాధవ్ మొదటినుండి కఠినంగానే వ్యవహరిస్తున్నారట. కమిట్ మెంటు, నిజాయితీ వల్లే మాధవ్ కు జిల్లా వ్యాప్తంగా మంచి పేరు వచ్చిందట. మరి అటువంటి ఉన్నతాధికారి వైసిపిలో చేరి ఎంపిగా పోటీ చేసే అవకాశాలున్నాయంటే టిడిపికి భయమేకదా ? మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.