గిద్దలూరు శాసనసభ్యుడు, వైసీపీ నేత అన్నా రాంబాబు తీరు మరింత వివాదమైంది. జనసేన కార్యకర్త వెంగయ్య ఆత్మహత్యకు కారణం ఆయన, ఆయన మనుషులేనని పవన్ కళ్యాణ్ సహా జనసేన నేతలంతా ఆరోపిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నిస్తే బూతులు తిట్టారని, బెదిరింపులకు పాల్పడ్డారని, దాంతో మనస్థాపం చెంది వెంగయ్య మరణించాడని అంటున్నారు. అన్నా రాంబాబు జనసేన కార్యకర్తలను బూతులు తిడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. నేరుగా పవన్ కళ్యాణ్ కలుగజేసుకోవడం, ఒంగోలు పర్యటనలో అన్నా రాంబాబును వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని హెచ్చరించడంతో అన్నా రాంబాబు స్పందించక తప్పలేదు.
అయితే ఈ స్పందన కార్యక్రమం కూడ వివాదానికి కేంద్ర బిందువైంది. మీడియా మొత్తాన్ని పిలిచి మీట్ పెట్టిన రాంబాబు తాను బూతులు మాట్లాడింది వాస్తవమేనని, అందులో తప్పేముందని తనని తాను సమర్థించుకోవడం చూసేవాళ్లను విస్మయానికి గురిచేసింది. వీడియోల్లో జనసేన కార్యకర్తల మీద ఏ మాట అయితే వాడారో అదే మాటను లైవ్లో పదే పదే ఉచ్చరించి మా ఊళ్ళో ఇలాగే మాట్లాడుకుంటాం అంటూ హిందీ సినిమాలను ఉదాహరణ చూపించారు. సినిమాల నుండే వచ్చారు కదా ఆమాత్రం తెలియదా అంటూ తన తిట్లను సమర్థించలేదు ఎందుకు అన్నట్టు మాట్లాడారు. మామూలు వ్యక్తులు ఆ మాటలు మాట్లాడుకుంటే ఎవ్వరూ పట్టించుకోరు. కానీ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న శాససభ్యుడు, గెలిపించిన ఓటర్లను గౌరవించాల్సిన ఎమ్మెల్యే అలా వాడుక భాష అంటూ బూతులు మాట్లాడుకుంటూ తిరిగితే న్యాయమేనా.
సరే ఎమ్మెల్యేగారి విధానం మేరకు, వైసీపీ విధానాల మేరకు జనం మీద వాడుక భాషలో తిట్లను ప్రయోగించడం తప్పేం కాదు అన్నప్పుడు ప్రెస్ మీట్లో ఆయన మాటలను సాక్షి పత్రికలో లేదా ఛానెల్ నందు ఆ పదంతో పాటే పూర్తిగా ఎందుకు ఉంచలేదు. ఇదే వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుగారి వాడుక భాష, ఆయన ప్రజలతో ఈ వాడుక భాషలోనే మాట్లాడతారు అంటూ ఎందుకు ప్రస్తావించలేదు. ఎందుకంటే అది ఆమోదయోగ్యం కాదు కాబట్టి. ఎమ్మెల్యే అయ్యాక కొన్ని పద్ధతులు, అలవాట్లు మార్చుకోవాలి. కాదు కూడదు పాత పద్దతిలోనే పోతాం అంటే ఇలాగే వివాదాలకెక్కాల్సి ఉంటుంది.
ఇవి చాలవన్నట్టు నేను రాజీనామా చేస్తా వచ్చి నా మీద పోటీచెయ్ అంటూ సవాల్ విసిరారు. మీరు తప్పు చేశారు అంటూ ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాల్సింది పోయి రాజీనామా చేస్తా చూసుకుందాం రా అనడం ఏంటో మరి. ఈ ప్రెస్ మీట్ మీద కూడ సామజిక మాధ్యమాల్లో తలంటేస్తున్నారు నెటిజన్లు. అన్నా రాంబాబుగారి మాటలు హీరోయిజమని, ఆయన రాజీనామా సవాళ్లు తెగువని ఆయన అభిమానులకు అనిపిస్తే అనిపించవచ్చేమో కానీ సామాన్య ప్రజలకు మాత్రం విపరీతమే అనిపిస్తాయి.