గిట్టనివారి వార్తలను గగ్గోలుపెట్టి మరీ చెప్తారు అదే అయినవారి వార్తలైతే గప్ చుప్ అంటారు. ఇది ఏపీలోని పక్షపాత మీడియా వైఖరి. రెండు ప్రధాన పత్రికలు రెండు ప్రధాన పార్టీలకు కొమ్ముకాస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థుల తప్పులను, లొసుగులను తాటికాయంత అక్షరాలతో ప్రచురించి హైరానా చేసే ఈ పత్రికలు తమవారు చేసే పనులను మాత్రం ప్రస్తావించరు. అందుకు నిదర్శనమే షర్మిల విషయంలో సాక్షి దాటవేత ధోరణి. వైఎస్ షర్మిల కొత్త పార్టీ పడుతున్నారన్నది దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. ఈ సంగతిని ఆంధ్రజ్యోతి చాలారోజుల నుండి ప్రముఖంగా ప్రస్తావిస్తూ వస్తోంది. కానీ వైసీపీ వర్గాలు, మీడియా దాన్ని అబద్దపు వార్తలని కొట్టుపారేస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. షర్మిల పార్టీ ఏర్పాట్లను వేగవంతం చేశారు.
ఈరోజు నుండి హైదరాబాద్ వేదికగా సమావేశాలు పెట్టుకున్నారు. ఇవి ఒక్కరోజులో ముగిసే సమావేశాలైతే కాదు. తెలంగాణలోని పలువురు కీలక నేతలు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. పార్టీ ఏర్పాటు, పాదయాత్ర, రాజకీయ ఎజెండాలు లాంటి పలు విషయాలను ఇందులో చర్చకు రానున్నాయట. ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. దీంతో మొదటి నుండి జగన్, షర్మిలకు ఎలాంటి గొడవలు లేవని, ఇవన్నీ కుట్రపూరిత వార్తలని చెబుతూ వచ్చిన వైసీపీ, సాక్షి మీడియా ఏమంటారు అనేది అందరికీ ఆసక్తిని రేకెత్తించింది. ఆసలు సాక్షిలో షర్మిల పార్టీ పెట్టడం వెనకున్న ప్రధాన కారణాలను ఎలా విశదీకరిస్తారు అనేది చూడాలని చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
వైసీపీ నేతలు మామూలుగానే సైలెంట్ అయిపోయారు. ఎక్కడా ఎవ్వరూ నోరెత్తట్లేదు. మీడియాకు కూడ షర్మిల పార్టీ గురించిన సంగతులు తమను అడగొద్దని చెప్పేసినట్టే ఉన్నారు. అయితే సాక్షి మీడియా కూడ మౌనం వహించడమే ఆశ్చర్యం. ప్రతిపక్షాలలో చీమ చిటుక్కుమన్నా నానా హైరానా చేస్తుంది సాక్షి. ప్రత్యర్థుల సొంత విషయాలను సైతం వదలదు. భూతద్దంలో పెట్టి చూపిస్తుంది. అటుతిరిగి ఇటుతిరిగి అది జగన్ ప్రభుత్వం మీద జరుగుతున్నా కుట్రని తేల్చేస్తుంది. అలాంటిది వైఎస్ షర్మిల పార్టీ గురించిన కనీస ప్రస్తావన కూడ తేవట్లేదు. సరే.. షర్మిల పార్టీ పెట్టడం అనేది అవాస్తవమనే అనుకున్నా ఈరోజైతే ఆమె హైదరాబాద్ లోటస్ పాండ్లో మీటింగ్ పెడుతుండటం అనేది ఖాయం.
అందులో పార్టీ గురించి కాకుండా వేరే ఏవైనా విశేషాలు ఉండొచ్చనే అనుకుందాం.
మరి వాటినైనా సాక్షి కవర్ చేయాలి కదా. చేయలేదు. షర్మిల సమావేశం ఎందుకు, ఎవరెవరు హాజరవుతున్నారు అనేది చెప్పలేదు చెప్పలేదు. షర్మిలకు సంబంధించిన ఏ చిన్న వార్తను అయినా జగన్ మీడియా హైలెట్ చేయడం కామన్. కానీ ఈసారి ముఖ్యమైన విషయాన్నే వదిలేశారు. సాక్షి ప్రదర్శిస్తున్న ఈరకమైన దాటవేత ధోరణి చూస్తేనే షర్మిల ఏదో గట్టిగానే ప్లాన్ చేశారని, ఆ ప్లాన్ వెనుక లక్ష్యాలు పెద్దవేనని, వాటికి జగన్ పేరును దూరంగా ఉంచుతున్నారని రూఢీ అవుతోంది.