సజ్జల పెద్దరికం పాతాళంలో.! వైసీపిని ముంచేస్తున్న పెద్దాయన.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ పార్టీ కీలక నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడగలరా.? ఛాన్సే లేదు.! కానీ, రాజకీయ ప్రత్యర్థులకు సజ్జల రామకృష్ణా రెడ్డి అలాగే ఆయన తనయుడు సజ్జల భార్గవ రెడ్డి.. ఇద్దరూ ఈజీ టార్గెట్స్ అయిపోతున్నారు.!

తాజాగా, సజ్జల రామకృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘ఎంజాయ్’ అనే పదాన్ని వాడేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ సందర్భంగా ఓ ప్రశ్నకు బదులిస్తే, ‘నో రిగ్రెట్స్.. దిగిపోవాల్సి వస్తే హ్యాపీగా దిగిపోతా..’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

కట్ అండ్ కన్‌ఫ్యూజ్ రాజకీయాలు తెలుగునాట, అందునా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జోరుగా సాగుతున్నాయి. ఈ విషయమై సజ్జల మాట్లాడుతూ, ‘ఔను, ఎంజాయ్ చేశారు.. దిగిపోతారు..’ అనేశారు. దీనికి ముందూ, వెనుకా.. టెక్స్‌ట్ వున్నాగానీ, వైసీపీకి ఏది నష్టమో, ఆ కంటెంట్ మాత్రమే జనాల్లోకి వెళుతోంది.

సజ్జల రామకృష్ణా రెడ్డి తనయుడు సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియాలో వైసీపీ ప్రత్యర్థి పార్టీలపై ఈ తరహా టెక్నాలజీనే వాడుతున్నప్పుడు, వైసీపీ నేతలు ఎంత అప్రమత్తంగా వుండాలి.? అందునా, తనయుడి విద్య తెలిసి, తండ్రి ఇంకెంత జాగ్రత్తగా వ్యవహరించాలి.?

సజ్జల నోరు జారేయడం, వివాదాస్పదమవుతోంది. వైసీపీకి వేరే శతృవు అక్కర్లేదు.. సజ్జల రామకృష్ణా రెడ్డి రాలు.. అంటూ వైసీపీ వర్గాల్లోనే పెదవి విరుపులు వ్యక్తమవుతున్నాయి. ‘అవగాహన లేకుండా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీపీఎస్ రద్దుపై హామీ ఇచ్చారు..’ అంటూ అప్పట్లో సజ్జల పెద్ద బాంబే పేల్చిన సంగతి తెలిసిందే.

కాగా, ‘డీఎస్‌సీ ఎందుకు దండగ’ అని సజ్జల చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదమవుతున్నాయి. ‘సంక్షేమ పథకాల పేరుతో పేదలకు ఎంతో కొంత పడేస్తే..’ అన్న ఆయన డైలాగూ వైరల్ అవుతోంది.