పవన్-రామ్ భేటీ అందుకేనా ?

మొత్తానికి అమెరికాలోని తానా సభలను సొంతానికి రాజకీయనేతలు బాగానే ఉపయోగించుకుంటున్నారు. బహుశా నిర్వాహకులు కూడా అందుకే రాజకీయ ప్రముఖులను అందుకే పిలిచారా అన్న అనుమానం కూడా పెరిగిపోతోంది. ఎందుకంటే తానా సభల్లో పాల్గొనేందుకు అమెరికాకు చేరుకున్న అనేక మంది నేతల మధ్య వ్యక్తిగత మీటింగ్ లు కూడా జరిగాయి. పవన్ –రామ్ మాధవ్ మధ్య జరిగిన భేటీ కూడా ఇందులో ఒకటి మాత్రమే.

టిడిపి నుండి బిజెపిలోకి ఫిరాయించిన రాజ్యసభ సభ్యుల్లో సుజనా చౌదరి, సిఎం రమేష్ అండ్ కో కూడా సమావేశాల్లో పాల్గొన్నారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఎలాగూ ఉంటారు కదా ? వాళ్ళతో పాటు టిడిపి ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు అండ్ కో కూడా పాల్గొన్నారు. వీళ్ళు కాకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైలైట్ గా నిలిచారు.

ఇక్కడే అసలు విషయం దాగుందంటున్నారు. ఎలాగంటే రామ్ మాధవ్-పవన్ మధ్య దాదాపు గంటపాటు ఏకాంత భేటీ జరిగిందట. మిగిలిన వాళ్ళ మధ్య జరిగిన భేటీ విషయం ఎలాగున్నా వీళ్ళద్దరి మధ్య జరిగిన భేటీపైనే అందరి దృష్టి నిలిచింది. బిజెపికి పవన్ తొందరలో మద్దతు పలుకనున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైపోయింది.

ఇక్కడ విషయం ఏమిటంటే ఇద్దరి ఒకళ్ళవసరం మరొకరికి ఉంది.  పవన్ కేమో జనసేన పార్టీని నడిపేంత ఓపిక లేదు. బిజెపికేమో ప్రజాకర్షక నేత లేరు. కాబట్టి పవన్ బిజెపితో చేతులు కలిపితే ఉభయతారకంగా ఉంటుందని మధ్యవర్తులు చెప్పారట. అందుకనే ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారనేది సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.