గడచిన రెండు రోజులుగా హటాత్తుగా ఓ పేరు మారు మోగిపోతోంది. ఇంతకుముందు చాలా కొద్దిమందికి మాత్రమే పరిచయమైన పేరు ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో మోతెక్కిపోతోంది. ఇంతకీ ఆ పేరు ఎవరిదని ఆలోచిస్తున్నారా ? ఆయనేనండి ప్రభోదానందస్వామి. ఈ స్వామి పేరు గతంలో చాలామంది వినుండే అవకాశం దాదాపు లేదనే చెప్పవచ్చు. అటువంటిది అనంతపురం టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి పుణ్యమా అని ఈ పేరు బాగా పాపులర్ అయిపోయింది.
హటాత్తుగా అంత పాపులర్ అయిపోయిన ప్రభోదానందస్వామి అసలు ఎవరు ? ఎక్కడి నుండి వచ్చారు . ఆశ్రమంలో ఏం చేస్తుంటారు ? అనే ప్రశ్నలు చాలామందిని ఇపుడు తొలిచేస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రభోదానందస్వామి అసలు పేరు అబ్బయ్య చౌదరి. తాడిపత్రి నియోజకవర్గంలోనే ఉన్న పెద్దపప్పుల మండలం అమ్ములదిన్నె గ్రామం.
చౌదరి పూర్వశ్రమంలో ఆర్మీలో పనిచేశారు. 1980 వరకూ అర్మీలో వైర్ లెస్ ఆపరేటర్ గా పనిచేసిన తర్వాత రిటైర్ అయ్యారు. ఆర్మీలో ఉద్యోగం తర్వాత తన స్వగ్రామానికి వచ్చిన చౌదరి ఆర్మీలో పనిచేసినపుడు వచ్చిన డబ్బుతో 15 ఎకరాలను కొనుగోలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఉత్తరభారతానికి వెళ్ళిపోయారు. అంటే 1980లో ఉత్తరభారతానికి వెళ్ళిన చౌదరి సుమారు 13 సంవత్సరాల పాటు అక్కడే ఉన్నారట. ఉత్తరభారతంలో ఉన్నపుడు ఎక్కువ కాలం మహారాష్ట్రలోనే గడిపారట.
మళ్ళీ 1993లో తిరిగి స్వగ్రామానికి చేరుకున్న చౌదరి తనను తాను ప్రభోదానందస్వామిగా పరిచయం చేసుకున్నారు.
తన సొంత స్ధలంలోనే ఓ 2 వేల ప్లాట్లు వేసి విక్రయించారు. ఉత్తరభారతంలో ఉన్నపుడు ఏవో కొన్ని ఆశ్రమాల్లో పనిచేసి ఆధ్యాత్మిక అంశాలపై కాస్త పట్టుసాధించారని స్ధానికులు చెప్పుకుంటుంటారు. అందుకే రామాయణ-భాగవతంలోని అంశాలను కలగలిపి త్రైత సిద్దాంతమనే కొత్త సిద్దాంతాన్ని ప్రవేశపెట్టారని చెప్పుకుంటున్నారు. మెల్లి మెల్లిగా స్వామి భోదనలకు ఆకర్షితులైన స్ధానికులు ఇతరుల వల్ల ఆశ్రమంకు భక్తుల తాకిడి పెరిగింది.
గడచిన 18 ఏళ్ళల్లో మెల్లిగా స్వగ్రామం నుండి ఇతర ప్రాంతాలకు కూడా ఆశ్రమకార్యకలాపాలు విస్తరించాయని చెప్పుకుంటున్నారు. విశాఖపట్నం, కడపలో కూడా ఆశ్రమాలున్నాయని సమాచారం. అయితే ఆశ్రమంలో జరిగే కార్యకలాపాల విషయంలో ఎవరికీ సరైన సమాచారం మాత్రం లేదు. ఆశ్రమానికి రాజకీయవాసనలు కూడా పెద్దగా లేవు. అందుకనే ప్రభోదానందస్వామి జనాల నోళ్ళల్లో పెద్దగా నానటం లేదు. హటాత్తుగా గణేష్ నిమజ్జనం సందర్భంగా జరిగిన గొడవలో అనంతపురం టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి జోక్యం కారణంగా ఆశ్రమం గురించి బయటప్రపంచానికి తెలిసింది.
ఇక, ప్రస్తుతానికి వస్తే గణేష్ నిమజ్జనాన్ని ఊరేగింపుగా వెళుతున్న గ్రామస్తులను ఆశ్రమ నిర్వాహకులు అడ్డుకోవటంతో వివాదం మొదలైంది. దాంతో జేసి మద్దతుదారులైన గ్రామస్తులు ఆశ్రమంలోకి చొరబడటం, రాళ్ళతో దాడి చేయటం పలువురు భక్తులను గాయపరచారు. భక్తులు కూడా తిరగబడటంతో పరిస్దితి అదుపుతప్పి ఉద్రిక్తతకు దారితీసింది. మొత్తం మీద ఇక్కడ మూడు విషయాలు గమనించాలి. మొదటిది ప్రభోదానందస్వామి అసలు పేరు అబ్బయ్య చౌదరి. అశ్రమంలో జరిగే కార్యకలాపాలపై బయటప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. జేసి సోదరులంటే టిడిపిలోనే మండిపోతున్న వారు చాలామందున్నారు. అందుకనే జేసికి వ్యతిరేకంగా పలువురు ప్రజాప్రతినిధులు తెర వెనుక నుండి ప్రభోదానంద స్వామికి మద్దతుగా నిలిచారని ప్రచారం జరుగుతోంది. దాంతో ఆధ్యాత్మికంగానే కాకుండా సామాజికవర్గం కోణంలో కూడా ఆశ్రమం ఇపుడు వివాదాల్లో ఇరుక్కుంది. మరి రేపేం జరుగుతుందో చూడాల్సిందే.