న్యాయవ్యవస్ధ ఆదేశాలను ధిక్కరించటం ద్వారా చంద్రబాబునాయుడు ఎటువంటి సంకేతాలు పంపదలుకున్నారో అర్దం కావటం లేదు. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో స్ధానిక పోలీసులు తమకు ఏ విధంగా కూడా సహకరించటం లేదని ఎన్ఐఏ ఉన్నతాధికారులు కోర్టును ఆశ్రయించారు. కేసు దర్యాప్తు విషయంలో స్ధానిక పోలీసులు సహకరించటం లేదంటే ఏమనర్ధం ? ప్రభుత్వంలోని పెద్దల సూచనలు లేకుండానే పోలీసులు తమంతట తాము అంతటి నిర్ణయాన్ని తీసుకోగలరా ? అక్టోబర్ 15వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై హత్యాయత్నం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ కేసులో కుట్రకోణం బయటకు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం విచారణ కాకుండా థర్డ్ పార్టీ తో విచారణతో చేయించాలంటూ జగన్ హై కోర్టును ఆశ్రయించారు.
సరే జగన్ డిమాండ్ ను తోసుపుచ్చుతూ ప్రభుత్వం తరపున కూడా గట్టి లాయరే వాదించారు. అయినా కోర్టు జగన్ పిటీషన్నే సమర్ధించింది. అందులోను హత్యాయత్నం జరిగింది కేంద్రప్రభుత్వ పరిధిలోని విమానాశ్రయంలో కాబట్టి ఎన్ఐఏ విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో చంద్రబాబు అండ్ కో ఉలిక్కిపడింది. అప్పటి నుండి ఎన్ఐఏ విచారణను అడ్డుకునేందుకు చంద్రబాబు, పుత్రరత్నం నారా లోకేష్ నానా విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగామే స్ధానిక పోలీసుల సహాయ నిరాకరణ. మూడు రోజులుగా ఎన్ఐఏ ఉన్నతాధికారులు విశాఖపట్నంలోనే క్యాంపు వేసినా అంగుళం కూడా విచారణ ముందుకు సాగలేదు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు లేకుండా తాము ఏ విధంగాను సాయం అందిచలేమంటూ లోకల్ పోలీసులు ఎన్ఐఏ ఉన్నతాధికారులకు స్పష్టంగా చెప్పారంటేనే కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు అండ్ కో ఎంతగా ప్రయత్నిస్తున్నారో అర్ధమైపోతోంది. హత్యాయత్నంలో టిడిపిలోని ముఖ్యుల హస్తం లేకపోతే ఎన్ఐఏ విచారణకు ఎందుకు ప్రభుత్వం అంతగా అడ్డుకుంటోందని సామాన్యులకు సైతం అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వం తీరుచూస్తుంటే వైసిపి నేతలు ఆరోపిస్తున్నట్లుగా చంద్రబాబే సూత్రదారా అన్న అనుమానం అందరిలోను బలపడుతోంది.
తాజాగా స్ధానిక పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా ఎన్ఐఏ కోర్టును ఆశ్రయించింది. జగన్ పై హత్యాయత్నానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను స్ధానిక పోలీసుల నుండి తమకు ఇప్పించాల్సిందిగా కోర్టులో పిటీషన్ వేయటం నిజంగా ధౌర్భాగ్యమే. అలాగే ఈ కేసును విజయవాడలోని హైకోర్టుకు బదిలీ చేయాలని కూడా ఎన్ఐఏ కోరింది. నిందితుడు శ్రీనివాస ను విచారణ నిమ్మితం తమ కస్టడికి అప్పగించాలని కోరుతూ మరో పిటీషన్ కూడా వేయబోతోంది. ఎందుకంటే, కోర్టు అనుమతి లేకుండా నిందితుడిని తమకు స్ధానిక పోలీసులు తమకు అప్పగిస్తారని ఎన్ఐఏ అనుకోవటం లేదు. అందుకనే కోర్టులో పిటీషన్ వేయాలని ఎన్ఐఏ డిసైడ్ చేసిందట. మొత్తానికి న్యాయవ్యవస్ధ ఆదేశాలను కూడా చంద్రబాబు ధిక్కరిస్తున్నారంటే ఆశ్చర్యంగానే ఉంది. మరి ఎన్ఐఏ పిటీషన్ కు కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే.