ఇంతకీ పవన్ ఎందుకు అల్లూరి విగ్రహావిష్కరణకు డుమ్మా కొట్టినట్టు.?

Pawan

భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరిగింది. అది రాజకీయ కార్యక్రమమా.? ప్రభుత్వ కార్యక్రమమా.? ప్రైవేటు కార్యక్రమమా.? అన్నదానిపై భిన్నవాదనలున్నాయి. విగ్రహాన్ని ఏర్పాటు చేసింది క్షత్రియ సేవా సమితి. విగ్రహ దాత కూడా వేరే వున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత మహోత్సవ్ కార్యక్రమాన్ని ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంతో లింక్ చేసింది. వెరసి, అంతా గందరగోళం.

సరే, ఎవరి గోల వారిది. అధికార వైసీపీకి చెందిన రెబల్ ఎంపీని ఈ కార్యక్రమానికి రానివ్వలేదు. మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని ఆహ్వానించారు. చిత్రమేంటంటే, మరో మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజుని లైట్ తీసుకున్నారు. సీనియర్ నటుడు, ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రాన్ని నిర్మించి, అందులో నటించిన సూపర్ స్టార్ కృష్ణకీ ఆహ్వానం లేదు.

అంతా గందరగోళమే.! అసలు ఇలా ఎలా ఈ కార్యక్రమాన్ని ఇంత పేలవంగా చేపట్టారు.? అన్నదానిపై బోల్డంత చర్చ జరుగుతోంది. ఇంకోపక్క, చిరంజీవిని పిలిచి.. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్‌ని పక్కన పెట్టారెందుకంటూ ఇంకో వాదన తెరపైకొచ్చింది.

జనసేన అధినేత అయినంతమాత్రాన, బీజేపీకి మిత్రపక్షం అయినంతమాత్రాన పవన్ కళ్యాణ్‌ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తారా.? అలా ప్రత్యేకంగా ఆహ్వానించినా ఆయన ఎందుకు వెళ్ళలేదు.? అన్నదానిపై ఇంకో చర్చ. బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలి కాబట్టి, పవన్ ఇలా చేశారన్నది ఇంకో విశ్లేషణ.

మోడీకి పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ కూడా చెప్పాక, బీజేపీతో జనసేనాని తెగతెంపులు చేసుకుంటారని ఎలా అనగలం.?