తాజాగా జనసేన అభ్యర్ధుల జాబితాను చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానులు మొదలయ్యాయి. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ మధ్య క్విడ్ ప్రో కో నడుస్తున్న విషయం అందరికీ తెలిసిపోయింది. అందుకనే పవన్ తో పాటు జనసేన కీలక నేతలు పోటీ చేసే నియోజకవర్గాల్లో టిడిపి బలహీన అభ్యర్ధులను పోటీ చేయిస్తోందనే ప్రచారం అందరూ వింటున్నదే. అదే విధంగా నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ కాకుండా సిపిఐకి టికెట్ కేటాయించింది.
సరే ఈ క్విడ్ ప్రో కో ఇలా వుండగా జనసేన తాజా జాబితాలో ఓ ఆసక్తికరమైన అంశం బయటపడింది. అదేమిటంటే విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గంలో జనసేన తరపున జేడి లక్ష్మీనారాయణ పోటీ చేయబోతున్నారు. ఇక్కడి నుండి వైసిపి తరపున రియాల్టర్ ఎంవివి సత్యనారాయణ పోటీ చేస్తుంటే టిడిపి తరపున స్వయంగా లోకేష్ తోడల్లుడు శ్రీ భరత్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
చంద్రబాబు పుత్రరత్నం, బాలకృష్ణ పెద్దల్లుడు లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో సిపిఐ పార్టీ అభ్యర్ధిని పోటీ చేయిస్తున్నారు. లోకేష్ గెలుపుకు వీలుగా సీటును జనసేన వదులుకుందన్న విషయం అందిరికీ తెలిసిపోతోంది. మరి అలాంటపుడు విశాఖపట్నం లోక్ సభ సీటులో మాత్రం జనసేన తరపున జేడి లక్ష్మీనారాయణను ఎందుకు పోటీలోకి దింపుతోంది ? ఇక్కడ టిడిపి తరపున బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ పోటీ చేస్తున్నారు.
అంటే లోకేష్ పోటీచేసే నియోజకవర్గంలో ఒకలాగ, శ్రీ భరత్ పోటీ చేయబోతున్న నియోజకవర్గంలో మరోలాగ పవన్ నిర్ణయం తీసుకున్న విషయం స్పష్టమవుతోంది. తన కొడుకు గెలుపు విషయంలో తీసుకున్న శ్రద్ధ భరత్ విషయంలో గాలికొదిలేశారన్నమాట. మరి బాలకృష్ణంటే పవన్ కు పడదా లేకపోతే భరత్ పోటీ గెలుపును చంద్రబాబు పట్టించుకోవటం లేదా ?