సినిమా థియేటర్లను మూసివేసే ప్రసక్తే లేదు..’ అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో సినిమా థియేటర్ల విషయమై వస్తున్న పుకార్లు, డిమాండ్లపై స్పందించారు. మరి, స్కూళ్ళను ఎందుకు మూసేసినట్లు.? అన్న ప్రశ్నకు అధికార పక్షం దగ్గర సరైన సమాధానం కనిపించడంలేదు. తెలంగాణలో ఆరో తరగతి నుంచి ఆ పై క్లాసులకు మాత్రమే విద్యా సంస్థలు ఇటీవల తెరిచిన విషయం విదితమే. అవి కాస్తా ఇప్పుడు మూతపడ్డాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మూసివేత నిర్ణయాన్ని ఆహ్వానించాల్సిందే. అయితే, అంతకన్నా ముందు మద్యం దుకాణాల్నీ, బార్లనూ, రెస్టారెంట్లనూ మూసివేయాల్సి వుంటుందన్నది మెజార్టీ ప్రజల అభిప్రాయంగా కనిపిస్తోంది. సినిమా థియేటర్లు కూడా కరోనా హాట్ స్పాట్స్‌గా మారే అవకాశాలున్నాయి. థియేటర్లు దాదాపుగా ‘ఏసీ’ కావడంతో, వైరస్ మూసివున్న ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది గనుక.. 500 ఆపైన సంఖ్యలో ప్రేక్షకులుండే సినిమా థియేటర్లలో వైరస్ చాలా వేగంగా వాప్తి చెందేందుకు ఆస్కారముంటుంది. కానీ, సినీ పరిశ్రమ గడచిన ఏడాదిలో చాలా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది.
ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమను ఇంకోసారి ఇబ్బందిపెట్టకూడదన్న ప్రభుత్వ ఆలోచన కొంతవరకు సమర్థనీయమే. కానీ, సినిమా థియేటర్ల ద్వారా కరోనా వ్యాప్తి పెరిగితే బాధ్యత వహించేదెవరు.? నేటి నుంచి తెలంగాణలో స్కూళ్ళు మూతపడగా, పార్కులు ఇతరత్రా వినోద కేంద్రాలన్నీ కిటకిటలాడాయి. అలాంటప్పుడు విద్యా సంస్థలు మాత్రమే మూసివేసి ప్రయోజనమేంటి.? ప్రజలు బాధ్యతగా మెలగాల్సిందేగానీ.. ఆ బాధ్యత ప్రజల్లో లేనప్పుడు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోక తప్పదు.