ఆనం రాంనారాయణ రెడ్డి.. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఇలా ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు, సొంత పార్టీకి దూరమయ్యారు. ఎందుకిలా.? ఈ ముగ్గురిలో ఆనం రాంనారాయణ రెడ్డి కథ వేరు. మిగతా ఇద్దరు నేతలు, వైసీపీకి ఎంతో విధేయంగా వుంటూ వచ్చారు చాలాకాలంగా.
ఇక, ఈ లిస్టులోకి తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వచ్చి చేరారు. ఆయన కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడే. పైగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడాయె.!
అసలేం జరుగుతోంది వైసీపీలో.? వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఔట్ అయితే, అందులో ఒక్కరు మాత్రమే దళిత ఎమ్మెల్యే.. మిగతా ముగ్గురూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలే. ఇప్పుడు ఇంకో ఎమ్మెల్యే వైసీపీని వీడబోతున్నారు. మరో ‘రెడ్డి’ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సమయం కోసం ఎదురుచూస్తున్నారు.
టీడీపీ మీద కమ్మ పార్టీ అనే ముద్ర వున్నట్లే, వైసీపీ మీద రెడ్ల పార్టీ అన్న ముద్ర వుంది. చెరిపేస్తే చెరిగిపోయేది కాదిది. చంద్రబాబుని కమ్మ సామాజిక వర్గానికే చెందిన కొడాలి నాని ఎక్కువగా తిడుతుంటారు. అలాగే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించేందుకు రెడ్డి నాయకులు రంగంలోకి దిగుతున్నట్లుంది వ్యవహారం.
అన్నట్టు, పవన్ కళ్యాణ్ మీదకి కాపు నాయకుల్నే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్కువగా ఉసిగొల్పుతుంటారనుకోండి.. అది వేరే సంగతి. మిగతా విషయాలెలా వున్నా, వైసీపీ అధినేత ఆత్మవిమర్శ చేసుకోవాలి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే వైసీపీలో వుండలేని దుస్థితి ఎందుకు వస్తుందో ఆత్మపరిశీలన చేసుకోవాలి. పైగా, అత్యంత సన్నిహితులు పార్టీని వీడుతున్నారంటే, పార్టీకి కష్టకాలమేనని గుర్తించాలి.