వైనాట్ 175.! చంద్రబాబు కూడా అదే.! కానీ.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ‘వైనాట్ 175’ అంటోంది.! ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అలాగే నినదిస్తోంది. ‘ఈసారి కుప్పం కూడా మాదే..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటోంటే, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందులలోనూ వైసీపీని టీడీపీకి దెబ్బ కొట్టి, ‘వైనాట్ పులివెందుల’ అని నినదించిన సంగతి తెలిసిందే.

‘పులివెందులలోనే వైసీపీ గెలిచే పరిస్థితి లేదు. తొలిసారిగా ఓ అధికార పార్టీ పూర్తిగా వాషౌట్ అయిపోయే ఎన్నికలు 2024లో జరగబోతున్నాయ్..’ అంటూ తెలుగుదేశం పార్టీ కొత్త పల్లవి అందుకుంది. అసలు ఆ పరిస్థితి రాష్ట్రంలో వుందా.? అన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.

వాస్తవానికి, 2019 ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 అసెంబ్లీ సీట్లు 3 ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని ఆ పార్టీ కలలో కూడా ఊహించి వుండదు. ఏపీలో ఏ సర్వే కూడా ఈ తరహా రిజల్ట్‌ని అంచనా వేయలేకపోయింది. రాజకీయం అంటేనే అంత.! అయితే, జనసేన పార్టీతో పొత్తు లేకుండా తమ గెలుపుని టీడీపీ ఊహించుకోలేకపోతోంది. జనసేన మాత్రమే సరిపోదు, బీజేపీ కూడా కావాలనుకుంటోంది టీడీపీ.

‘మేం ముగ్గురం కలిస్తే, ఏపీ రాజకీయాల నుంచి వైసీపీ కనుమరుగైపోతుంది..’ అన్నది టీడీపీ వాదన. ‘వైనాట్ 175’ అంటూ టీడీపీ కొత్త పల్లవి అందుకోవడం వెనుక అసలు స్కెచ్ టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జనసేన.! వామపక్షాలు కూడా లిస్టులో వున్నాయ్‌గానీ, బీజేపీ వుండే గ్రూపులోకి అవి రాకపోవచ్చు.

‘దమ్ముంటే సింగిల్‌గా పోటీ చేయాలి..’ అంటూ జనసేనకి వైసీపీ సవాల్ విసరడం వెనుక అసలు కోణం, అసలంటూ టీడీపీ – బీజేపీ – జనసేన కాంబినేషన్ వర్కవుట్ కాకూడదనే.!