వైఎస్ షర్మిల పాదయాత్రని ఎవరూ పట్టించుకోరేం.?

ఖర్చు దండగ వ్యవహారం.. అంటూ, తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయం గురించి సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం విదితమే. ‘మేం ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం..’ అనే ధీమా షర్మిల వ్యక్తం చేస్తున్నా, ‘ముందు ఏదో ఒక చోట నుంచి పోటీ చేసి గెలిసి చూపించు..’ అనే ప్రశ్న ఆమె మీదకు దూసుకొస్తోంది.

నిజానికి, హుజూరాబాద్ ఉప ఎన్నిక వైఎస్ షర్మిలకు కలిసొచ్చిన అవకాశం. ఈ ఉప ఎన్నికలో తమ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టి వుంటే, కాస్తో కూస్తో షర్మిల పార్టీ పేరు గట్టిగా వినిపించేది తెలంగాణ రాజకీయాల్లో. వైఎస్సార్ తెలంగాణ పార్టీ.. అన్న పేరునే చాలామంది పట్టించుకోవడంలేదంటే, ఆ పార్టీ పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు.

ఇక, షర్మిల.. సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టేశారు. పాదయాత్ర ప్రారంభోత్సవం రోజున బహిరంగ సభ కోసం జనాన్ని బాగానే సమీకరించారు. ఆ తర్వాత కూడా షర్మిల వెంట కొంతమేర జనాన్ని నడిపించేందుకు ఆపసోపాలు పడుతూనే వున్నారు. కానీ, ఎన్నాళ్ళిలా.?

స్వచ్ఛందంగా ఓ పది మంది అయినా వస్తే, ఇంకో పాతిక మందిని పురమాయించొచ్చు.. ఆ పది మంది కూడా లేకపోతే ఎలా.? అన్న చర్చ షర్మిల పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోందట. ఏ ధైర్యంతో షర్మిల, తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు.? అన్నదానిపై ఇప్పటికీ ఓ స్పష్టత లేదు.

తెలంగాణతో రాజకీయ పంచాయితీ అనవసరం గనుక, తెలంగాణలో వైఎస్సార్సీపీ జెండాని పీకేశారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దాంతో, ఆ పార్టీకి సంబంధించిన కేడర్, చీలిపోయింది.. షర్మిల వైపు కొందరు, బీజేపీతోపాటు కాంగ్రెస్ తదితర పార్టీల్లోకి మరికొందరు వెళ్ళిపోయారు.

షర్మిల వైపు వెళ్ళిన ఆ కొద్ది మంది పాత వైసీపీ నేతలూ, ఇప్పుడు ఇతర పార్టీల్లోకి దూకెయ్యక తప్పడంలేదు. షర్మిల తెలంగాణలో చేస్తున్న రాజకీయాలు అలాంటివి మరి. ఇలా ఎన్నాళ్ళు.? ఏమో షర్మిలకే తెలియాలి.