విచిత్రంగా ఉంది చంద్రబాబునాయుడు వ్యవహారం. జగన్మోహన్ రెడ్డి మీద గుడ్డి వ్యతిరేకతతో తప్పు చేసిన జనసేన ఏకైక ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ ను చంద్రబాబు మద్దతుగా మాట్లాడటమే విచిత్రంగా ఉంది. చంద్రబాబు ఉద్దేశ్యం ప్రకారం ప్రతిపక్ష ఎంఎల్ఏలు, నేతలు తప్పులు చేసినా సరే జగన్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకూడదన్నట్లే ఉంది.
ఇంతకీ విషయం ఏమిటంటే రాజోలులో పేకాటాడుతున్న కొందరిని పోలీసులు పట్టుకున్నారు. విషయం తెలిసిన వెంటనే వాళ్ళని వదిలేయమని రాపాక చెప్పారు. అయితే పోలీసులు వినకుండా పోలీసుస్టేషన్ కు తీసుకెళ్ళారు వాళ్ళని. దాంతో ఒళ్ళుమండిపోయిన రాపాక తన మద్దతుదారులతో పోలీసుస్టేషన్ పై దాడి చేశారు.
దాంతో పోలీసులు రాపాకతో పాటు మద్దతుదారులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. తర్వాత అరెస్టు చేసి బెయిల్ పై వదిలిపెట్టారు. వాస్తవం ఇదైతే రాపాకను అరెస్టు చేయటం అన్యాయమన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. జర్నలిస్టపై దాడి చేసిన నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రధర్ రెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకోని ప్రభుత్వం రాపాకను అరెస్టు చేయటమేంటి ? అంటూ విచిత్రంగా వాదిస్తున్నారు.
జర్నలిస్టు-కోటంరెడ్డి వివాదంలో ఇద్దరు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. తప్పు ఎవరిదైనా సరే చర్యలు తీసుకోవాల్సిందే. తప్పు చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోమని డిమాండ్ చేయాల్సిన చంద్రబాబు రాపాకపై చర్యలు తీసుకోవటాన్ని తప్పుపట్టటమేంటో అర్ధం కావటం లేదు. ఓ ఎంఎల్ఏ పోలీసుస్టేషన్ పై దాడి చేయటం చంద్రబాబుకి తప్పుగా కనిపించలేదు.
తాను అధికారంలో ఉన్నంతకాలం టిడిపి ఎంఎల్ఏలు, నేతలు ఎవరిపై దాడులు చేసినా పట్టించుకోలేదు. చింతమనేని ప్రభాకర్ ఉదంతాలే ఇందుకు నిదర్శనాలు. అలాంటిది ఇపుడు పోలీసులు రాపాకను అరెస్టు చేస్తే మండిపోతున్నారు. అసలు జనసేన ఎంఎల్ఏ రాపాకను అరెస్టు చేస్తే చంద్రబాబు ఎందుకింతగా మండిపోతున్నారో అర్ధం కావటం లేదు.