మూడు రోజుల క్రితం రాష్ట్రంలో జరిగిన ఐటి దాడులకు సంబంధించి చంద్రబాబునాయుడు నిజంగానే టెన్షన్ పడ్డారా ? అవుననే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అక్రమంగా సంపాదించిన సొమ్మంతా ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతోనే ఐటి దాడులను చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో ఖర్చుల కోసం ప్రతి నియోజకవర్గానికి చంద్రబాబు రూ. 30 కోట్లు పంపారట. ఆ డబ్బంతా బినామీల దగ్గరుండదట. ఐటి రైడ్లలో బినామీలు పట్టుబడితే తన బండారం ఎక్కడ బయటకు వస్తుందో అన్న ఆందోళనే చంద్రబాబులో కనిపిస్తోందంటూ జగన్ మండిప్డడారు.
23 మంది వైసిపి ఎంఎల్ఏలను పశువలను కొన్నట్లు కొనటానికి చంద్రబాబుకు డబ్బులు ఎక్కడినుండి వచ్చాయంటూ ఐటి అధికారులు కూపీ లాగుతారన్న భయమే చంద్రబాబులో కనిపించిదన్నారు. గతంలో కూడా అనేకసార్లు ఐటి దాడులు జరిగినా స్పందించని చంద్రబాబు ఇపుడే ఎందుకు అంతలా గిలగిలలాడుతున్నారంటూ జగన్ ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పగలరా ? నాలుగున్నరేళ్ళ చంద్రబాబు పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి అన్నదే కనిపించటం లేదంటూ తీవ్రంగా విమర్శించారు.
హిట్లర్ మంత్రివర్గంలో ఒక్క గోబెల్స్ ఉంటే చంద్రబాబు మంత్రివర్గంలో అందరూ గోబెల్సేనంటూ జగన్ ఎద్దేవా చేశారు. కంప్యూటర్ తో కూడా అబద్ధాలు చెప్పించగల గొప్పోడు చంద్రబాబు అంటూ బాగానే వెటకారమాడారు. చంద్రబాబు గోబెల్స్ ప్రచారానికి తోడు యెల్లో మీడియా మద్దతు కూడా తోడవ్వటంతో రెచ్చిపోతున్నట్లు చెప్పారు. చంద్రబాబు ఎలా చెబితే యెల్లో మీడియా దానికే తాళం వేస్తుందంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆమధ్య బిజెపికి జై అంటే యెల్లో మీడియాకు అదే అన్నదన్నారు. అదే చంద్రబాబు ఇపుడు కాంగ్రెస్ కు జిందాబాద్ అంటే యెల్లో మీడియా కూడా జిందాబాద్ అంటోందన్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసిపికి 21 పార్లమెంటు సీట్లొస్తాయన్న సీ ఓటర్ సర్వే యెల్లో మీడియాకు ఎందుకు కనబడటం లేదని జగన్ ప్రశ్నించటం విడ్డూరంగా ఉంది. వైసిపికి అనుకూలంగా సీ ఓటర్ సర్వే వస్తే యెల్లో మీడియా ఎందుకు చూపుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక మాఫియా, మట్టి మాఫియా, పోవలరం, పట్టిసీమ అవినీతిపైన యెల్లో మీడియాకు ఒక్క వార్తా ఎందుకు రాయటం లేదని అడగటం విచిత్రంగా ఉంది. మొత్తానికి విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగిన బహిరంగ సభ బ్రహ్మాండంగా హిట్ అయినట్లే.