అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబునాయుడు మాట్లాడుతున్న వైఖరి చూస్తుంటే అందరికీ అదే అనుమానం వస్తోంది. అనవసర విషయాలు ప్రస్తావించి వైసిపి వాళ్ళతో మాటలు పడుతున్నారు. తెలంగాణాలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు రుణమాఫీ, సున్నావడ్డీ రుణలు లాంటి అంశాలను ప్రస్తావించటం ద్వారా దారినపోయే చెత్తను తానే నెత్తినేసుకుంటున్నట్లు అనిపించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళటాన్ని చంద్రబాబు తప్పపట్టారు. నిజానికి ప్రాజెక్టు మొదలై పూర్తయిపోయింది ఏపికి చంద్రబాబు సిఎంగా ఉన్నపుడే. ప్రారంభోత్సవానికి జగన్ వెళ్ళటం వల్ల ఏపికి ఏదో అన్యాయం జరిగిపోయినట్లుగా చంద్రబాబు మాట్లాడారు. దాంతో జగన్ రెచ్చిపోయి వాయించేశారు. ప్రాజెక్టు నిర్మాణం మొదలైనపుడు చంద్రబాబు ఎందుకు అభ్యంతరం పెట్టలేదన్న జగన్ సూటిప్రశ్నకు చంద్రబాబు నుండి సమాధానం లేదు.
తమ హయాంలో రైతులకు రుణాలన్నింటినీ మాఫీ చేసినట్లు చెప్పిన చంద్రబాబు మరోసారి దొరికిపోయారు. దాంతో జగన్ తో పాటు మరికొందరు దుమ్ము దులిపేశారు. రుణమాఫీపై చంద్రబాబు ప్రకటనల వీడియో క్లిప్పింగులను అసెంబ్లీలో ప్రదర్శించారు. దాంతో ఏమీ మాట్లాడలేక చంద్రబాబు నోరు పడిపోయింది.
ఇక రైతులకు సున్నావడ్డీకే రుణాలు ఇప్పించినట్లు చెప్పారు చంద్రబాబు. జగన్ మాట్లాడుతూ ఏ రైతుకు కూడా సున్నావడ్డీకి రుణాలు ఇవ్వలేదని స్పష్టంగా చెప్పారు. సున్నావడ్డీకి ఏ ఒక్క రైతుకు కూడా రుణం అందలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తారా అన్న జగన్ సవాలుకు చంద్రబాబు మారు మాట్లాడలేదు. నిజానికి చంద్రబాబు చేస్తానని చేయని పనులను జగన్ ఇపుడు చేయటం మొదలుపెట్టారు. కాబట్టి ఆ విషయాలను మాట్లాడకుండా ఉంటేనే చంద్రబాబుకు కాస్తయినా గౌరవంగా ఉంటుంది.