పోటీకి వెనకాడుతున్న ఎంపిలు..కారణాలేంటి ?

ఐదేళ్ళు పూర్తిస్ధాయిలో అధికారాలను అనుభవించి కూడా రాబోయే ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేయటానికి టిడిపి ఎంపిలు వెనకాడుతున్నారంటే విచిత్రంగానే ఉంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ తరపున పోటీ చేయటానికి సుమారు 10 మంది ఎంపిలు వెనకాడుతున్నారు.  వాళ్ళంతా రేపటి ఎన్నికల్లో ఎంఎల్ఏలుగానే పోటీ చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. దాంతో చంద్రబాబునాయుడుకు రెండు విధాలుగా తలనొప్పులు మొదలయ్యాయి.

మొదటిదేమో పార్లమెంటు నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్ధులను వెత్తుక్కోవటం. రెండో సమస్య ఎంఎల్ఏలనో లేకపోతే సమన్వయకర్తలుగా ఇంతకాలం పార్టీ కోసం కష్టపడిన వారిని తప్పించటం. ఈ రెండు సమస్యలకు పరిష్కారం అర్ధంకాకపోవటంతో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్ మనోహర్ నాయుడు రాబోయే ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీకి పోటీ చేయాలని అనుకుంటున్నారు. దాంతో టెక్కలిలో  ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు ఎంపిగా పోటీ చేయటానికి ససేమిరా అంటున్నారు.

రాజమండ్రి ఎంపి మురళీ మోహన్ కూడా ఎంఎల్ఏగానే పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే, ఎంపి పోటీ చేయటానికి అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ లేదు. అయినా చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. ఇక ఏలూరు ఎంపి మాగంటి బాబుది కూడా అదే దారి. వచ్చే ఎన్నికల్లో దెందులూరు ఎంఎల్ఏగా పోటీ చేయటానికి ఆసక్తి చూపుతున్నారట. అయితే దెందులూరులో వివాదాస్పద ఎంఎల్ఏల చింతమనేని ప్రభాకర్ ను చంద్రబాబు తప్పిస్తారా ? అన్నది సస్పెన్సు.

విజయవాడ ఎంపి కేశినేని నాని కూడా రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారట. కాకపోతే నియోజకవర్గమే ఖాళీ లేదు. అసెంబ్లీ సీట్లలో పోటీకి చంద్రబాబు నో చెప్పిన తర్వాతే అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరారు. అనారోగ్య కారణాలతో తాను పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కాకినాడ ఎంపి తోట నర్సింహం నేరుగా చంద్రబాబుకే చెప్పేశారు. కానీ గెలుపుపై నమ్మకం లేకే పోటీనుండి తప్పుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. తన భార్య వాణికి జగ్గంపేట అసెంబ్లీ టికెట్ కోసం పట్టుబడుతున్నారు.

రాజధాని జిల్లా అయిన గుంటూరులో నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు కూడా పోటీకి వెనకాడుతున్నారు. తన కొడుకు రంగబాబుకు సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ కోసం పట్టుబడుతున్నారట. అనంతపురం ఎంపి జేసి దివాకర్ రెడ్డి తాను పోటీలో నుండి తప్పుకుంటున్నట్లు గతంలోనే ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. హిందుపురం ఎంపి నిమ్మల కిష్టప్ప కూడా రాబోయే ఎన్నికల్లో హిందుపురం అసెంబ్లీ కానీ లేకపోతే మరేదైనా అసెంబ్లీ టికెట్ కావాలని పట్టుపడుతున్నారు. ఇప్పటికి బయటపడిన ఎంపిలు వీరు. భవిష్యత్తులో ఇంకెంతమంది ఎంపిలు పోటీకి నిరాకరిస్తారో చూడాలి