ట్విట్టర్లో మాత్రమే పనికొస్తాడా ?

చూస్తుంటే నారా లోకేష్ వ్యవహారం అలాగే అనిపిస్తోంది. చంద్రబాబునాయుడు కొడుకు కాబట్టి అధికారంలో ఉన్నపుడు  చెలామణి అయిపోయారు. నిజానికి చంద్రబాబుకున్న తెలివితేటలు, విషయ పరిజ్ఞానం లోకేష్ లో ఏమాత్రం లేవని తెలిసిపోతోంది. అధికారంలో ఉన్నపుడు ఏం మాట్లాడినా చెల్లుబాటైపోయింది. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాతే లోకేష్ సత్తా ఏంటో అందరికీ తెలిసిపోతోంది.

నిజానికి లోకేష్ లో అసలు ఎటువంటి సామర్ధ్యం లేదని పార్టీలోనే చర్చ జరుగుతోంది. నిజంగానే లోకేష్ లో సామర్ధ్యం ఉండుంటే టిడిపి ఇంతటి ఘోర పరాజయానికి గురయ్యేది కాదని టిడిపి నేతలు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. లోకేష్ కు ఎంతో సన్నిహితుడైన ఎంఎల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలే చాలు. టిడిపికి రాజీనామా చేసిన ప్రభాకర్ మాట్లాడుతూ ఘోర పరాజయానికి లోకేషే కారణమని మండిపడిన విషయం అందరికీ తెలిసిందే.

పార్టీ ఓడిపోయిన తర్వాత లోకేష్ దాదాపు ట్విట్టర్ కే పరిమితమైపోయారు. ఇంత వరకూ ఏ జిల్లాలోను పర్యటించి నేతలను, కార్యకర్తలతో సమావేశం అయ్యిందే  లేదు. టిడిపి నేతలపై దాడులు పెరిగిపోతున్నాయని, వైసిపి హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని, జగన్ పాలనలో ఏపికి నష్టం జరుగుతోందంటూ లోకేష్ ట్విట్టర్లో మాత్రమే స్పందిస్తున్నారు. శాసనమండలిలో మాట్లాడింది కూడా పెద్దగా లేదు. ఏదైనా మాట్లాడుదామని ప్రయత్నించినా మంత్రుల దెబ్బకు నోరు పడిపోతోంది.

తమ హయాంలో చేసిన తప్పులు, అవినీతికి ఇపుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పుకోవాల్సొస్తోంది. అందుకనే లోకేష్ ఏమన్నా మాట్లాడుదామని ప్రయత్నించినా సమస్యలకు మూలాలు చంద్రబాబు పాలనలోనే ఉన్నట్లు ఆధారాలు చూపిస్తుండటంతో ఏమీ మాట్లాడలేకపోతున్నారు. అందుకనే కేవలం ట్విట్టర్ కు మాత్రమే పరిమితమై కాలం గడిపేస్తున్నారు.