దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ అనుబంధాన్ని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెంచుకోనున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తాయని ఇప్పటి వరకూ చాలామంది కాంగ్రెస్ నేతలు భావించారు. తెలంగాణాలో దెబ్బతిన్నా ఏపిలో మాత్రం మునుపటికన్నా రేపటి ఎన్నికల్లో మంచి ఫలితాలే సాధించవచ్చని కూడా అనుకున్నారు. అలాంటిది హఠాత్తుగా టిడిపితో పొత్తుండదని పార్టీ హై కమాండ్ తీసుకున్న నిర్ణయంతో చాలామంది సీనియర్ నేతలు విస్తుపోయారు. అటువంటి వారిలో కర్నూలు జిల్లా పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కూడా ఒకరు.
అలాంటి కోట్లే హై కమాండ్ తాజా నిర్ణయాన్ని తప్పుపడుతున్నారంటే కాంగ్రెస్ పరిస్ధితి క్షేత్రస్ధాయిలో ఎలా ఉందో అర్ధమైపోతోంది. రేపటి ఎన్నికల్లో పార్టీ సంగతి ఎలాగున్నా నేతలుగా తాము బతికి బట్ట కట్టాలంటే మాత్రం కాంగ్రెస్ ను వీడాల్సిందే అనే నిర్ణయానికి వచ్చారు కోట్ల. అందులో భాగంగానే కోట్ల తెలుగుదేశంపార్టీలో చేరే అవకాశాలున్నాయని సమాచారం. పోయిన ఎన్నికల్లో కర్నూలు ఎంపి స్ధానానికి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కోట్లకు సుమారుగా 1.10 లక్షల ఓట్లు వచ్చాయి. అంటే మూడోస్ధానంతో సరిపెట్టుకోవాల్సొచ్చింది.
రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పై జనాలు పోయిన ఎన్నికల సమయంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. అయినా కోట్లకు లక్ష ఓట్లపైగా వచ్చాయి. అలాంటిది రానున్న ఎన్నికల్లో టిడిపితో కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని కోట్ల భావించారు. టిడిపితో పొత్తులతో కాంగ్రెస్ అభ్యర్దిగా కర్నూలు నుండి పోటీ చేస్తే గెలుపు కూడా ఖాయమనే కోట్ల అనుకుంటున్నారు. ఇటువంటి సమయంలో హై కమాండ్ నిర్ణయంతో కోట్ల నెత్తిన పిడుగు పడినట్లౌంది. దాంతో తక్షణ కర్తవ్యంగా ఏం చేయాలో కోట్ల ఆలోచించారు. పొత్తులు లేకపోతే కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేయటంలో ఉపయోగం లేదన్నది కోట్ల భావన.
అందుకనే టిడిపిలో చేరి ఆ పార్టీ అభ్యర్ధిగానే పోటీ చేయాలని మద్దతుదారుల నుండి ఒత్తిళ్ళు ఎక్కువవుతున్నట్లు సమాచారం. మద్దతుదారుల ఒత్తిళ్ళ మేరకే కోట్ల తొందరలో టిడిపి తీర్ధం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. కోట్లకు కర్నూలు ఎంపి టిక్కెట్టు ఇవ్వటానికి చంద్రబాబునాయుడు కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. అన్నీ సమీకరణలు కుదిరితే తొందరలోనే కోట్ల సైకిల్ ఎక్కటం ఖాయంగా తెలుస్తోంది. బిసిలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో కోట్ల వ్యూహాలు, అంచనాలు ఏ మేరకు ఫలిస్తాయో కాలమే చెప్పాలి.