జనసేన పరిస్ధితి మరీ ఇంత అన్యాయమా ?

అదే ఆశ్చర్యంగా ఉంది సర్వేలను చూస్తుంటే. ఎన్నికలన్నాక పలానా పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని ఇన్ని వస్తాయని అంచనాలు వేయటం సహజం. పలానా పార్టీకి అధికారంలోకి రావటం ఖాయమని కూడా చెబుతాయి. సర్వేలన్నీ ప్రతీసారి నిజాలవుతాయా అంటే అవుతాయని చెప్పేందుకు కూడా లేదు. కాకపోతే జనాల నాడి ఏ విధంగా ఉందనే విషయంలో ఓ అంచనాకైతే రావచ్చంతే.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి మెజారిటీ సర్వేలన్నీ వైసిపికే పట్టం కడుతున్నాయి. ఇప్పటి వరకూ వెలువడిన సర్వేల్లో టిడిపి అధికారంలోకి వస్తుందని చెప్పిన సర్వేలు చాలా తక్కువనే చెప్పాలి. ప్రతీ సర్వే సంస్ధ కూడా వైసిపి, టిడిపి గురించే మాట్లాడుతున్నాయి కానీ జనసేన గురించి పెద్దగా మాట్లాడటం లేదు.

మొత్తం 175 అసెంబ్లీ స్ధానాలకు గాను 10 నియోజకవర్గాల్లో కూడా జనసేన గెలుస్తుందని ఏ సర్వే కూడా చెప్పలేదు. ఒకవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమో తానే కింగ్ మేకర్ నని తన పార్టీకి తక్కువలో తక్కువ 30 అసెంబ్లీ సీట్లు వస్తాయని చెబుతున్నారు. మరి ఏ లెక్కల ఆధారంగా 30 సీట్లు వస్తాయని పవన్ చెబుతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు.

ఓటింగ్ సరళి తర్వాత జనసేనకు మహా వస్తే ఓ నాలుగు సీట్లు వస్తే అదే చాలా ఎక్కువని జనసేన వర్గాలే అంచనా వేస్తున్నాయి. భీమవరం, గాజువాకలో పోటీ చేసిన పవన్ ఒకదానిలో గెలిచినా చాలన్నట్లుగా జనసేన నేతలు మాట్లాడుకుంటున్నారు. అంటే జనసేన తరపున పోటి చేసిన  మిగిలిన 139 మంది అభ్యర్ధుల గెలుపు అవకాశాలను పక్కన పెట్టినా పవనే పరువు కోసం పోరాడినట్లు అర్ధమైపోతోంది. మొత్తం మీద జనసేన పరిస్ధితి మాత్రం చాలా దారుణంగా తయారైందని అర్ధమైపోతోంది.