Budget 2025: కేంద్ర బడ్జెట్‌పై వైసీపీ మౌనం.. ఎందుకిలా?

గత కొంతకాలంగా వైసీపీ ఏ విషయాలపై కూడా పెద్దగా సౌండ్ చేయడం లేదు. ప్రముఖ నాయకులు పార్టీకి దూరం అవుతుండడంతో భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైగా జగన్ విదేశాల నుంచి బెంగుళూరుకు పయణమవ్వడంతో పార్టీ శ్రేణుల్లో కాన్ఫిడెన్స్ తగ్గిందనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై అన్ని వర్గాలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి.

రాజకీయ పార్టీల నుంచి పారిశ్రామిక వర్గాల వరకు ప్రతిఒక్కరు తమ విశ్లేషణలను అందించగా, వైసీపీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గతంలో కేంద్ర బడ్జెట్‌లపై వెంటనే స్పందించిన జగన్, ఈసారి మౌనం పాటించడంపై రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ మొదలైంది. గతంలో ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాలను ప్రశంసించిన వైసీపీ, గత బడ్జెట్‌లకు కూడా స్వాగతం పలికింది. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, జగన్ కేంద్రంతో దూరంగా ఉన్న పరిస్థితి దీనికి ప్రధాన కారణం. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలలో పోటీ చేయడం, ఆ తర్వాత వైసీపీ కేంద్రంతో సంబంధాలు తగ్గించుకోవడం మౌనం కొనసాగడానికి ఒక కారణంగా కనిపిస్తోంది. మరోవైపు, జగన్ బడ్జెట్‌పై స్పందిస్తే అనవసరమైన రాజకీయ విమర్శలు ఎదురవుతాయని భావించారని తెలుస్తోంది. ఏ విధంగానైనా ఆయన చెప్పిన మాటలను విరుపు చేసేందుకు ప్రత్యర్థులు సిద్ధంగా ఉన్నారని అంచనా వేసి, ఈ వివాదాలకు దూరంగా ఉండటమే మంచిదని నిర్ణయించుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

పైగా, ఆయనపై ఉన్న కేసులు, వాటిలో వచ్చే కొత్త పరిణామాలను బట్టి కేంద్రం వద్దకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడొచ్చని కూడా కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ బడ్జెట్‌పై ఇంతవరకు మౌనం పాటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవంగా, రాష్ట్రానికి ప్రత్యేక నిధులు, ప్రాజెక్టుల కోసం కృషి చేయాల్సిన ప్రతిపక్షం పూర్తిగా మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. కేంద్రంతో వైసీపీ దూరం పెరిగిందా? లేక వేరే వ్యూహంతో ముందుకు వెళ్లాలనుకుంటున్నారా? అనే ప్రశ్నలకు సమాధానం సమీప భవిష్యత్తులోనే తెలుస్తుంది.

ముసలి ట్రంప్ తాత || Director Geetha Krishna Shocking Comments On Donald Trump || Telugu Rajyam