కన్నబాబు ఎక్కడ.? అవంతి శ్రీనివాస్ ఇప్పుడేం చేస్తున్నారు.? పేర్ని నాని పరిస్థితేంటి.? అనిల్ కుమార్ యాదవ్ సంగతేంటి.? ఇలా పలువురు మాజీ మంత్రుల గురించిన చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. వీళ్ళే కాదు, మాజీ మంత్రి పుష్పశ్రీనాణి సహా చాలామంది మాజీ మంత్రుల విషయమై నెటిజనం సోషల్ మీడియా వేదికగా సవాలక్ష ప్రశ్నలు సంధిస్తున్నారు.
‘నా గురించి ఏదేదో ప్రచారం చేస్తున్నారు. జగనన్న నిర్ణయాలు ఏవైనా అవి మాకు శిరోధార్యం..’ అంటూ సందర్భానుసారం ఆయా వైసీపీ మాజీ మంత్రులు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది తప్ప, కార్యకర్తలకూ ఆయా నేతలు సరిగ్గా అందుబాటులో వుండడంలేదట.
మంత్రులుగా పనిచేస్తున్న సమయంలో అయితే, కేవలం పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికో, చంద్రబాబు మీద మండి పడడానికో మాత్రమే ఆయా నేతలు మీడియా ముందుకు వచ్చేవాళ్ళు తప్ప, తమ తమ శాఖల పని తీరు పట్ల సమీక్షలు చేయడానికో, వాటి గురించి ప్రజలకు తెలియజెయ్యడానికో, ప్రజల సమస్యల గురించి తెలుసుకోవడానికో మాత్రం శ్రద్ధ పెట్టేవారు కాదన్న విమర్శలున్నాయి.
కొడాలి నాని, పేర్ని నాని.. ఇలా ఈ నేతలు అడపా దడపా మీడియా ముందుకొస్తున్నా, వారిలో నిరాశా నిస్పృహలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త మంత్రుల పరిస్థితి మరీ దయనీయం. ముందస్తు ఎన్నికలొస్తే తమ పరిస్థితేంటంటూ వాపోతున్నారట కొత్త మంత్రులు తమ సన్నిహితుల వద్ద.
ఎందుకీ దుస్థితి.? ఇదే ఇప్పుడు వైసీపీలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ‘గడప గడపకీ మన ప్రభుత్వం..’ అంటై వైసీపీ ప్రజా ప్రతినిథులు జనం వద్దకు వెళుతోంటే, ఛీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అది మాజీ మంత్రులకు మరింత ఇబ్బందికరంగా తయారైంది.