అందుకేనా బ్యాలెట్ ఓటింగ్ కు పట్టుబడుతున్నది ?

ప్రపంచంలోనే టెక్నాలజీ వాడకంలో తానంతటి నాయకులు లేరని, దేశంలో టెక్నాలజీని పరిచయం చేసింది లేదని తరచూ చెప్పుకునే చంద్రబాబునాయుడు కూడా రివర్స్ గేర్ లో నడుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోలింగ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవిఎం) ద్వారా కాకుండా మళ్ళీ పాతకాలపు పేపర్ బ్యాలెట్ విధానాన్నే తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. పదే పదే బ్యాలెట్ ను డిమాండ్ చేస్తున్న కారణంగా అందరికీ చంద్రబాబు మీద అనుమానాలు మొదలయ్యాయి.

 

మామూలుగా అయితే ఎన్నికల్లో గెలిచినపుడు పోలింగ్ విధానం గురించి ఏమీ మాట్లాడని చంద్రబాబు ఓడినపుడు మాత్రం ఈవిఎంల విశ్వసనీయతపై ఆరోపణలు చేస్తుంటారు. కానీ విచిత్రంగా ఇంకా ఎన్నికలు ఆమడదూరంలో ఉండగానే ఈవిఎంలు వద్దని ఎందుకు అంటున్నారు ? ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో గెలుపుపై చంద్రబాబుకు ఏమైనా అనుమానాలు మొదలయ్యాయా ? క్షత్రస్ధాయిలో ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత ఉందన్న విషయంలో ఎవరికీ అనుమానాలు అవసరం లేదు. చాలా చోట్ల ప్రజా ప్రతినిధులపైన కూడా తీవ్ర వ్యతిరేకత కనబడుతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత జనాల్లోనే కాదు పార్టీలోని కార్యకర్తల్లో  కూడా వ్యతిరేకత వచ్చేసింది.

 

మంత్రులు, సిట్టింగ్ ఎంఎల్ఏల్లో ఎంతమందికి పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ సహకరిస్తారో కూడా చాలా నియోజకవర్గాల్లో అనుమానంగా ఉంది. ఇటువంటి పరిస్ధితుల్లోనే తిరిగి అధికారంలోకి వచ్చే విషయంలో చంద్రబాబుకు అనుమానాలు మొదలైనట్లు కనిపిస్తోంది. పైగా ఈవిఎంల ద్వారా తనను ఓడించేందుకు కుట్ర జరుగుతోందనే అనుమానం కూడా చంద్రబాబులో మొదలైందట. పొరబాటో లేకపోతే గ్రహపాటో కానీ మళ్ళీ సిఎం కాలేకపోతే చంద్రబాబు పరిస్ధితి ఎలా ఉంటుందో ఊహించటం కూడా కష్టమే. పార్టీలోను బయటే ఈ విషయం చర్చించుకుంటున్నపుడు చంద్రబాబుకు ఆలోచన లేకుండా ఉంటుందా ? అందుకే టెన్షన్ పెరిగిపోతోంది.

 

మరి మళ్ళీ అధికారంలోకి రావాలంటే మార్గమేంటి ? అన్న ఆలోచనలో నుండి వచ్చిందే పేపర్ బ్యాలెట్ విధానమట. ఎలాగూ అధికారంలో ఉన్నారు కాబట్టి వ్యవస్ధలను మ్యానేజ్ చేసుకుని ఎన్నికల్లో గట్టెక్కాలన్నది చంద్రబాబు ఆలోచనగా కనబడుతోంది. అందుకు ఏకైక మార్గం రిగ్గింగ్.  ఈవిఎం ఓటింగ్ అంటే రిగ్గింగ్ కష్టం. అదే పేపర్ బ్యాలెట్ అంటే చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత. అధికారంలో ఉంటారు కాబట్టి పోలీసు వ్యవస్ధ ఎలాగూ చెప్పుచేతల్లోనే ఉంటుంది. ప్రతిపక్ష పార్టీల పోలింగ్ ఏజెంట్లను మ్యానేజ్ చేసుకుంటే  చాలు సరిపోతుంది. అందుకనే పదే పదే బ్యాలెట్ ఓటింగ్ గురించి డిమాండ్ చేస్తున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి ఎన్నికల కమీషన్ ఏం చేస్తుందో చూడాలి.