చంద్రబాబునాయుడు వైఖరి ఎప్పుడు కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. తనవైపు తప్పులున్నా ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళనే ఆడిపోసుకుంటుంటారు. ఎదుటి వాళ్ళపై బురద చల్లేసి తుడుచుకోమనటం చంద్రబాబుకు చాలా సరదా. అందుకు తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.
ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఫణి తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటే జగన్ సినిమాకు వెళ్ళటమేంటి ? విదేశీ యాత్రలకు వెళ్ళటమేంటి ? అంటూ మీడియా సమావేశంలో ఊగిపోయారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా చంద్రబాబుకే చేయటానికి ఏమీ పనిలేనపుడు ఇక ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేయటానికి మాత్రం ఏముంటుంది ?
ఆ విషయం చంద్రబాబుకు తెలీకకాదు. అయినా సరే జనాల దృష్టిలో జగన్ ను విలన్ చేయాలన్నది చంద్రబాబు దురాలోచన. ఇంతకీ విషయం ఏమిటంటే, సినిమాకు, విదేశాలకు వెళ్ళటమేంటని నిలదీసిన చంద్రబాబుకు మంత్రుల విషయాన్ని మాత్రం దాచిపెట్టారు.
శ్రీకాకుళం జిల్లాకే చెందిన మంత్రి అచ్చెన్నాయుడు దుబాయ్ లో ఉన్నారు. పితాని సత్యనారాయణ ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ కు రెడీ అయ్యారట. ఇక సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు రోమ్, బ్రిటన్, ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. ఉత్తరాంధ్రకే చెందిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, సుజయ కృష్ణ రంగారావు, కిమిడి కళావెంకట్రావు, కిడారి శ్రవణ్ కుమార్ అడ్రస్సే లేరు. తన మంత్రులు అడ్రస్ లేకపోయినా, విదేశాల్లో ఉన్నా పట్టించుకోని చంద్రబాబు ప్రతిపక్ష నేత జగన్ ను మాత్రం టార్గెట్ చేయటం విడ్డూరంగా ఉంది.