జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం ఘటనను అనవసరంగా చంద్రబాబునాయుడు కెలుక్కుంటున్నట్లున్నారు. ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. దాంతో సమస్యను తనంతట తానే జాతీయస్ధాయికి తీసుకెళుతున్నట్లైంది. కేవలం మీడియా సమావేశం కోసమే ఢిల్లీకెళుతున్నట్లు సమాచారం. దాడి ఘటనను దాడిగా చూడకుండా మొత్తం డ్రామా అంటూ నిర్ధారించేశారు. ప్రధాన ప్రతిపక్షం నేత, జడ్ క్యాటగిరీలో ఉన్న జగన్ పై దాడి జరిగిందంటే భద్రతా వైఫల్యం వల్లే జరిగిందన్న విషయం అర్దమైపోతోంది.
ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ఎదురుదాడి చేయటం మొదలుపెట్టారు. ముందు డిజిపి ఠాకూర్ తో మొదలైన డ్రామా తర్వాత మంత్రులు చివరకు చంద్రబాబు మీడియా సమావేశంతో పీక్ స్టేజ్ కు చేరింది. మీడియా సమావేశంలో దాదాపు గంటన్నరపాటు మాట్లాడిన చంద్రబాబు హత్యాయత్నం ఘటనను చాలా చిన్నదిగా చిత్రీకరిచేందుకు ప్రయత్నించటం తెలిసిపోతోంది. దాంతో పాటు జగన్ డ్రామాలాడుతున్నారని, దాడిని బూచిగా చూపించి రాష్ట్రపతి పాలన తీసుకొచ్చే కుట్ర జరుగుతోందంటూ మండిపడ్డారు. దాడి చేసిన శ్రీనివాస్ వైసిపి అభిమానే అంటూ చెప్పి జనాల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నాలు చేశారు.
గంటన్నర సమావేశంలో మీడియా మిత్రులు చంద్రబాబు చెప్పింది రాసుకొచ్చేశారే కానీ ఒక్కళ్ళు కూడా వాస్తవాలు మాట్లాడకపోవటం గమనార్హం. మీడియా సమావేశంలో తనను ఎదురు ప్రశ్నించే వారు లేరన్న విషయం తెలుసు కాబట్టే నోటికొచ్చినట్లు మాట్లాడారు. జగన్ ను పరామర్శించిన కెసియార్, కెటియార్, కవిత, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర నరసింహన్, పవన్ కల్యాణ్ కేంద్రమంత్రులు, కేంద్రమాజీ మంత్రి జయపాల్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ తూర్పారపట్టారు. అందరూ కలిసి రాష్ట్రంపై కుట్ర చేస్తున్నట్లు ధ్వజమెత్తారు.
చూడబోతే రాబోయే ఎన్నికల్లో ఈ ఘటన తెలుగుదేశంపార్టీ పై ఎక్కడ ప్రతికూల ప్రభావం చూపుతుందో అన్న అనుమానం, జగన్ ఆధ్వర్యంలో బిజెపి, పవన్ ఎక్కడ కూటమిగా కలుస్తారో అన్న ఆందోళనే చంద్రబాబులో కనబడుతోంది. నిజానికి గురువారం రాత్రి మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడిందే తప్పు. ఆ విషయం శుక్రవారం ఉదయం నుండి అన్నీ పార్టీలు చంద్రబాబుపై విరుచుకుపడటంతోనే స్పష్టమైపోయింది. నిందుతుడు శ్రీనివాస్ వైసిపి అభిమాని చెప్పిందన్నది శుక్రవారం తెల్లవారికి తప్పని తేలిపోయింది.
అదే సమయంలో శ్రీనివాస్ కుటుంబం టిడిపి మద్దతుదారులని అందుకే రెండిళ్ళు మంజూరయ్యాయని తేలిపోయింది. పైగా నిందుతుని జేబులో దొరికినట్లు చెబుతున్న 11 పేజీల లేఖను ముగ్గురు రాసినట్లుగా తేలిపోయింది. దాంతో చంద్రబాబు ఆరోపణలన్నీ తప్పని రుజువైయింది. విషయాన్ని అక్కడితో వదిలేయకుండా హత్యయత్నం ఘటనపై మాట్లాడేందుకు శనివారం ఢిల్లీకి వెళుతున్నారు. అంటే మళ్ళీ జగన్, మోడి, పవన్, బిజెపి తదితరులపై ఆరోపణలు గుప్పించటం ఖాయం. మరి, ఢిల్లీ మీడియా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే, జాతీయ మీడియా అంటే జాతిమీడియా కాదు కదా ?