చంద్రబాబు బండారం బయటపడుతుందా ?

నూతన సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి ఆంధ్రప్రదేశ్ రాక సందర్భంగా చంద్రబాబునాయుడు బండారం బయటపడుతుందా ? అవుననే అంటున్ను భారతీయ జనతా పార్టీ నేతలు. జనవరి 6వ తేదీన మోడి ఆంధ్రాకు వస్తున్నారనగానే స్వయంగా చంద్రబాబే వ్యతిరేకించిన సంగతి అందరికీ తెలిసిందే. ఏపికి ఏమొహం పెట్టుకుని మోడి వస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన మోడి జనాలకు ముందుగా క్షమాపణలు చెప్పిగాని అడుగుపెట్టేందుకు లేదని చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అంతటితో ఆగకుండా మోడి రాకను అడ్డుకోవాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు కూడా ఇచ్చారు. దాంతో మోడి రాక సందర్భంగా ఏం జరుగుతుందో అన్న ఆందోళన మొదలైంది.

 

అదే సందర్భంలో మోడి రాక బిజెపి నేతల్లో ఉత్సాహం నింపుతోంది. ప్రధాని రాక సందర్భంగా చంద్రబాబు బండారం బయటపడే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు చెబుతున్న ప్రత్యేకహోదా విషయంలో ఎన్డీఏలో ఉన్నంత కాలం చంద్రబాబు వేసిన పిల్లిమొగ్గల గురించి మోడి రాష్ట్రప్రజలకు వివరించే అవకాశాలున్నాయని సమాచారం. ఎన్డీఏలో ఉన్నంత కాలం చంద్రబాబు ప్రత్యేకహోదా ను పూర్తిగా వ్యతిరేకించారు. అదే సందర్భంగా ఢిల్లీకి వెళ్ళిన ప్రతీసారి రెండు అంశాల మీదే ప్రధానంగా దృష్టి సారించేవారని బిజెపి స్ధానిక నేతలు ఆరోపిస్తున్నారు. ఒకటి  వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అరెస్టు, రెండోది అసెంబ్లీ సీట్లను పెంచటం.

 

ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు పై రెండు అంశాలను తప్ప ఏనాడూ ప్రత్యేకహోదా ను అడగలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చాలాసార్లే చెప్పారు. తన పర్యటనలో మోడి అదే విషయాలను వివరించే అవకాశాలున్నాయని బిజెపి నేతలు భావిస్తున్నారు. ఒకవేళ మోడి గనుక అదే విషయాలను ప్రస్తావిస్తే చంద్రబాబు ఇబ్బందుల్లో పడటం ఖాయం. అందుకనే మోడి రాకను వ్యతిరేకించాలంటూ చంద్రబాబు పిలుపిచ్చారని బిజెపి నేతలు అనుమానిస్తున్నారు. అయితే, మోడి రాకను వ్యతిరేకించేంత సీన్ చంద్రబాబుకు లేదన్న విషయం అందరికీ తెలుసు.

 

ఆమధ్య పార్లమెంటులో మోడి మాట్లాడుతూ, వైసిపి ట్రాప్ లో చంద్రబాబు పడిపోయారని, కెసియార్ తో పోల్చుకుంటే చంద్రబాబులో మెచ్యురిటీ తక్కువని అన్నారు గుర్తుందా ? ఆ మాటలనే ఇఫ్పటికీ చంద్రబాబు పదే పదే చెప్పుకుని ఉడికిపోతుంటారు. అటువంటిది జనవరిలో మోడి వచ్చినపుడు గనుక ప్రత్యేకహోదా విషయంలో తెరవెనుక ఏం జరిగిందో బయటపడితే చంద్రబబాబు పని అంతే సంగతులు.