చంద్రబాబు ఎందుకు వెనకాడుతున్నారు ?

షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ రెండు పార్టీల అధినేతలు అభ్యర్ధుల ఎంపిక కసరత్తును ముమ్మరం చేస్తున్నారు. అభ్యర్ధుల ఎంపిక, ప్రకటనల విషయంలో చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా భిన్న దారులను అనుసరిస్తున్నారు.  వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డేమో అభ్యర్ధులను బహిరంగంగానే ప్రకటించేస్తున్నారు. అదే చంద్రబాబు విషయానికి వస్తే సమీక్షల్లో మాత్రమే నేరుగా చెబుతున్నారు. తర్వాత పలానా నియోజకవర్గానికి పలానా అభ్యర్ధి పేరు పరిశీలనలో ఉందని, పలానావారిని ఖరారు చేశారని లీకుల రూపంలో వివరాలందిస్తున్నారు.

చంద్రబాబు కసరత్తును కూడా నిజంగా చెప్పాలంటే పది రోజుల క్రితమే సీరియస్ గా తీసుకున్నారు. అంతకుముందు జిల్లాల పర్యటనలో ఉన్నపుడు సమీక్షలు చేయటం, నిప్పులు చెరగటం, వార్నింగులు ఇవ్వటం లాంటి వాటికే పరిమితమయ్యారు. తాను చేయించుకుంటున్న సర్వే నివేదికలను ఎంఎల్ఏలకు ఇచ్చి భేరీజు వేసుకోమనటం లేదా క్లాసులు తీసుకోవటానికి మాత్రమే పరిమతమయ్యారు. అంతేకానీ ఏ నియోజకవర్గంలో కూడా పలానా నేత పోటీ చేయబోతున్నట్లు అధికారికంగా ఇప్పటి వరకూ ప్రకటన చేయలేదు.  కనీసం ప్రెస్ నోట్ కూడా విడుదల కాలేదు.

వాస్తవం ఇలాగుంటే చంద్రబాబు మీడియా మాత్రం టిడిపి అభ్యర్ధుల్లో కోలాహలమని, అభ్యర్ధుల్లో ఫుల్లు జోష్ అంటూ జాకీలెత్తే పనిలో ఉంది. టిడిపి అభ్యర్ధుల్లో ఎవరి విషయమో దాకా అనవసరం. కొడుకు లోకేష్ పోటీ చేయబోయే నియోజకవర్గం విషయాన్ని కూడా ఇంత వరకూ ప్రకటించలేకపోయారు. అదే సమయంలో కర్నూలు ఎంపి, ఎంఎల్ఏ అభ్యర్ధిత్వాలను లోకేష్ ప్రకటించినా వారిని చంద్రబాబు మార్చేస్తున్నారు. దాంతో లోకేష్ చేసిన ప్రకటనలకు ఎటువంటి విలువ లేదని తేలిపోయింది.

అధికారంలో ఉన్న చంద్రబాబేమో అధికారిక ప్రకటనలకు వెనకాడుతుంటే ప్రతిపక్షంలో ఉన్న జగన్ మాత్రం బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా 13 జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా కొందరు అభ్యర్ధుల పేర్లను జగన్ ప్రకటించటం గమనార్హం. కర్నూలు జిల్లాలో పత్తికొండలో శ్రీదేవిరెడ్డి, చిత్తూరు జిల్లాలోని కుప్పలంలో రాజమౌళి, నంద్యాలలో ఓ ముస్లిం అభ్యర్ధిని, నెల్లూరులో అనీల్ కుమార్ యాదవ్ ఇలా సుమారు 15 మంది అభ్యర్ధిత్వాలను ప్రకటించేశారు. జగన్ చేస్తున్న పనిచేయటానికి చంద్రబాబు ఎందుకు వెనకాడుతున్నారు ?