ఆరోపణలు నిజమైతే విచారణ చేయించరా ? మళ్ళీ దగ్గరవుదామనేనా ?

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గతంలో ఎన్నడూ లేనంతగా ఆరోపణలు చేశారు. విజయనగరం, శ్రీకాకుళం బహరింగసభల్లో మాట్లాడుతూ పోలవరం, అమరావతి నిర్మాణాల్లో చంద్రబాబు భారీ ఎత్తున అవినీతికి పాల్పడినట్లు మండిపడ్డారు. అవినీతి, అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై చంద్రబాబు దుష్ప్రచారం మొదలుపెట్టినట్లుగా అమిత్ షా చెబుతున్నారు. అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు నిలువెత్తు రూపంగా అభివర్ణించారు. అవినీతి పాలన వల్ల జనాల్లో చంద్రబాబుపై బాగా వ్యతిరేకత వచ్చేసినట్లు కూడా షా చెబుతున్నారు.

సరే అమిత్ షా చెప్పేవన్నీ నిజాలే అని అనుకుందాం. మరి అంత ఎత్తున అవినితి, అక్రమాలకు పాల్పడినప్పుడు కేంద్రం ఏ విధమైన విచారణ జరిపించదా ? పోలవరం, అమరావతి నిర్మాణాల్లో కేంద్రం ఇచ్చిన నిధులు కూడా ఉన్నాయి కదా ? కేంద్ర నిధులు దుర్వినియోగం అయినట్లు తన దృష్టికి రాగానే కేంద్రం ఏం చేయాలి ? వెంటనే విచారణ జరిపించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా ? అంటే మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి ఎటువంటి అవినీతి, అక్రమాలకు పాల్పడినా కేంద్రం చూస్తు ఊరుకుంటుందనే కదా అర్ధం ?

ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగినట్లు స్వయంగా కమలంపార్టీ జాతీయ అధ్యక్షుడే చెప్పిన తర్వాత కూడా విచారణ చేయించకపోతే ఎలా ? అమిత్ ఆరోపణలు చేశారంటే అందుకు ఆయన దగ్గర ఏవో ఆధారాలు ఉండే ఉంటాయి. ఆధారాలు లేకపోతే ఆరోపణలు ఎందుకు చేస్తారు ? చంద్రబాబు నాలుగున్నరేళ్ళ పాలనపై అవినీతి జరిగిందని రాష్ట్రంలో అందరూ అనుకుంటున్నదే. కానీ అందరూ అనుకోవటానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు ఆరోపణలు చేయటానికి చాలా తేడా ఉంటుంది. ఆరోపణలు చేసిన జాతీయ అధ్యక్షుడే చంద్రబాబు అవినీతిపై విచారణ ఎందుకు చేయించటం లేదో కూడా చెప్పాలి.

అవినీతి జరిగిందని చంద్రబాబుపై ఆరోపణలు  చేస్తు విచారణ గురించి మాత్రం అమిత్ మాట్లాడకపోవటంలో అర్ధమేంటి ? ఎన్నికల తర్వాత చంద్రబాబు అవసరం పడుతుందని షా భావిస్తున్నారా ? రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏ బలం తగ్గుతుందని సర్వేలు చెబుతున్నాయి. అదే నిజమైతే మరింతమంది మిత్రుల అవసరం బిజెపికి అవసరమవుతుంది. అందులో భాగంగానే చంద్రబాబు అవసరం మళ్ళీ తమకు రావచ్చన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు అవినీతిపై కేంద్రం విచారణ జరిపించటం లేదా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి షా చేస్తున్న ఆరోపణలతో చంద్రబాబుకు ఏదో జరిగిపోతుందని ఎవరూ కంగారు లేదా సంతోష పడాల్సిన అవసరం లేదోమో ?