నారా లోకేష్‌ని అడ్డుకుని ఏపీ పోలీసులు ఏం సాధించినట్లు.?

రాష్ట్రంలో శాంతి భద్రతలు అద్భుతంగా వున్నాయని అధికార వైసీపీ చెబుతోంది. అలాంటప్పుడు, మాజీ మంత్రి, పైగా ఎమ్మెల్యేని పోలీసులు ఎందుకు అడ్డుకున్నట్లు.? శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్ళేందుకు నారా లోకేష్ ప్రయత్నించారు. సరే, ఈ పర్యటన వెనుక రాజకీయ కారణాలే వుండొచ్చుగాక. కానీ, వెళ్ళకూడదని పోలీసులు ఆంక్షలు పెడితే ఎలా.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో పోలీసుల ఆంక్షలు కఠినాతి కఠినంగా మారుతున్నాయి. చంద్రబాబు హయాంలో కూడా ఇలాంటి పరిస్థితులు చూశాం. పోలీసులు, రాజకీయ నాయకుల్ని అడ్డుకోవడం కొత్తేమీ కాదు. ప్రభుత్వంలో వున్నవారికి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు చంద్రబాబు హయాంలోనూ, వైఎస్ జగన్ హయాంలోనూ మామూలే అయిపోయాయి.

ఎందుకిలా.? రాజకీయ నాయకులు ఊరకే రాజకీయ పర్యటనలు చేయరు. గలాటా సృష్టిస్తారు. ఆ తర్వాత పోలీసు వ్యవస్థ వైఫల్యమని విమర్శిస్తారు. అందుకే, పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపడతారు. వీటి వెనుక రాజకీయ కోణాలు, అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్ళనేవి సర్వసాధారణం.

కొన్నాళ్ళ క్రితం విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబుని పోలీసులు అడ్డుకుంటే, న్యాయస్థానం పోలీసుల్ని పిలిచి మరీ చీవాట్లు పెట్టిన విషయం విదితమే. మరిప్పుడు, నారా లోకేష్ విషయంలో ఎందుకు మళ్ళీ పోలీసులు అలాగే వ్యవహరించినట్లు.? పలాసలో అధికార వైసీపీకీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకీ మధ్య ఇళ్ళ కూల్చివేతల వ్యవహారంపై గలాటా చోటు చేసుకుంది.

మంత్రి సీదిరి అప్పలరాజు మీద విమర్శలు వస్తున్నాయి. ఆయనేమో టీడీపీ కుట్ర అంటున్నారు. టీడీపీ నేతలేమో, మంత్రి సీదిరి అప్పలరాజుదే తప్పని అంటున్నారు. బాధితులు సైతం, మంత్రి సీదిరి అప్పలరాజుపై మండిపడుతున్నారు. అద్గదీ అసలు విషయం. కానీ, ఎన్నాళ్ళు టీడీపీ నేతల్ని పోలీసులు అడ్డుకోగలుగుతారు.?