వైసిపికి రాజీనామా వెనుక ఇంత కథ నడిచిందా ?

రానున్న ఎన్నికల్లో ఘట్టమనేని ఆదిశేషగిరి రావు తెలుగుదేదశంపార్టీ తరపున తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి జరుగుతున్న ప్రచారం నిజమే అయితే సిట్టింగ్ ఎంఎల్ఏ, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పరిస్ధితేంటి ? ఈ ప్రశ్నకు టిడిపిలో ఎవరూ సమాధానం చెప్పలేకున్నారు. సంవత్సరాల తరబడి వైసిపిలో కీలక నేతగా ఉన్న ఆదిశేషగిరిరావు హఠాత్తుగా పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వైసిపిలో రాజకీయ వ్యవహార కమిటిలో సభ్యునిగా కూడా ఉన్నారు. జగన్ కు అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరుగా ఆదిశేషగిరిరావుకు పేరుంది.

 

రేపటి ఎన్నికల్లో వైసిపినే అధికారంలోకి వస్తుందని ఒకవైపు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో చంద్రబాబునాయుడుపై జనాల్లో బాగా వ్యతిరేకతా కనబడుతోంది. మరో రెండు నెలల్లో ఎన్నికలు పెట్టుకుని గెలుస్తుందని అనుకుంటున్న పార్టీలో నుండి ఓటమి తప్పదనే ప్రచారం జరుగుతున్న టిడిపిలోకి ఎందుకు ఆదిశేషగిరి రావు చేరుతున్నారు ? ఈ విషయమే ఎవరికీ అర్ధం కావటం లేదు. టిడిపిలోకి ఎప్పుడు చేరేది స్పష్టత లేకున్నా వైసిపికి మాత్రం రాజీనామా చేసేశారు.

 

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రేపటి ఎన్నికల్లో తెనాలి అసెంబ్లీ నుండి పోటీ చేయబోతున్నారట. ఆదిశేషగిరి రావు వైసిపిలో నుండి బయటకు వచ్చేయటంలో చంద్రబాబు ఒత్తిడి బాగా ఎక్కువుగా ఉండటమే ప్రధాన కారణమని సమాచారం. ఆదిశేషగిరి రావు సోదరుడు, సూపర్ స్టార్ కృష్ణకు అల్లుడైన గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గుంటూరు నుండే పోటీ చేయబోతున్నారు. అదే సమయంలో ఆది శేషగిరిరావు వైసిపిలో కీలక నేతగా ఉన్నారు.  ఆదిశేషగిరావుకు కూడా గల్లా జయదేవ్  అల్లుడి వరసే అవుతారు కదా. రానున్న ఎన్నికలు రెండు పార్టీలకు చావో రేవో లాంటివే. అందుకే మామా, అల్లుళ్ళు చెరో పార్టీలో ఉంటే కష్టమని భావించిన చంద్రబాబు గల్లా ద్వారా ఆదిశేషగిరి రావుపై టిడిపిలోకి రావాలంటూ ఒత్తిడి పెట్టించినట్లు సమాచారం. కుటుంబపరంగా వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేకే చివరకు ఆదిశేషగిరి రావు వైసిపిలో నుండి టిడిపిలోకి రావటానికి అంగీకరించారని తెలిసింది.