నరసాపురం లోక్ సభ సీటులో గెలుపెవరిది?

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మిగిలిన లోక్ సభ సీట్లన్నీ ఒకెత్తు.. నరసాపుర పార్లమెంట్ స్థానం మరొకెత్తు అని చెప్పుకున్నా అతిశయోక్తి కాదు. కారణం… ఈ స్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నది… వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. దీంతో… రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ నియోజకవర్గంపై మీడియాతోపాటు ప్రజల అటెన్షన్ కూడా ఉంటుంది. అయితే ఈ స్థానంలో రాబోయే ఎన్నికల్లో గెలుపోటములు ఎలా ఉండే అవకాశాలను ఒకసారి పరిశీలిద్దాం!

నరసాపురం లోక్ సభ స్థానం నుంచి ఏ పార్టీనుంచైనా క్షత్రియ సామాజిక వర్గం నేతలే పోటీచేస్తుంటారు. ఈ స్థానానికి 1957 నుంచి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. 1996లో టీడీపీ నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు, 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి చేగొండి హరిరామ జోగయ్య మినహా… మిగిలినవారంతా క్షత్రియ సామాజికవర్గానికి చెందినవారే. ఈ క్రమంలోనే గడిచిన ఎన్నికల్లో జగన్… వ్యూహాత్మకంగా ఆర్.ఆర్.ఆర్. ను ఎంపిక చేశారు. టీడీపీ కూడా క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వేటుకూరి వెంకట శివరామరాజుని నిలబెట్టింది. ఫలితాల్లో వీరిద్దరి మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం 3% కంటే తక్కువే!

అయితే ఈ స్థానంలో జనసేన నుంచి నాగబాబు పోటీచేయగా… వైసీపీ అభ్యర్థికీ నాగబాబుకీ మధ్య ఓట్ల తేడా సుమారు 17%. ఇక ఈ స్థానం నుంచి పోటీచేసిన కాంగ్రెస్, బీజేపీలకు చెరొక్క శాతం ఓట్లు రావడం గమనార్హం. అయితే ఈసారి టీడీపీ నుంచి వేటుకూరి శివరామరాజే పోటీచేయొచ్చని మాటలు వినిపిస్తున్న తరుణంలో.. జనసేన నుంచి రఘురామకృష్ణం రాజు పోటీచేస్తారని అంటున్నారు. ఈ మేరకు జనసేన నుంచి ఆర్.ఆర్.ఆర్. కు ఆహ్వానం కూడా అందిందని.. ఆయన కూడా సానుకూలంగా ఉన్నారని తెలుస్తుంది.

ఒకవేళ టీడీపీ – జనసేన పొత్తు ఫిక్సయినా కూడా… ఈ విషయంలో చంద్రబాబు నుంచి కూడా రఘురామరాజుకు ఎటువంటి వ్యతిరేకత రాదు కాబట్టి… ఈ సీటు జనసేనకే ఇచ్చే ఛాన్స్ లేకపోలేదు. ఇక ఇక్కడ ఆర్.ఆర్.ఆర్. ను కొట్టే బలమైన నేతకోసం వైసీపీ చూస్తుందని తెలుస్తుంది. ఈ విషయంలో గతంలో జగన్ మాటైచ్చి చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారని చెబుతున్న… గాదిరాజు సుబ్బరాజుకి ఈ స్థానం నుంచి ఈసారి పోటీచేసే అవకాశాలున్నాయని సమాచారం.

గాదిరాజు సుబ్బరాజు.. అలియాస్ తవుడుకొట్టు సుబ్బరాజు కి సౌమ్యుడిగా, కష్టపడి పైకొచ్చిన వ్యక్తిగా, నలుగురితో కులమతాలకు అతీతంగా కలిసిపోయే మనిషిగా పేరుందని చెబుతుంటారు భీమవరం ప్రజానికం. ఇది సుబ్బరాజుకి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ అధిష్టాణం గాదిరాజుకి ఛాన్స్ ఇచ్చిన క్రమంలో… రఘురామకృష్ణం రాజుకి బలమైన ప్రత్యర్థి దొరికినట్లే అవుతుంది! ఇక ఇక్కడ నుంచి కాంగ్రెస్, బీజేపీ, ఇతర ఏపార్టీ అభ్యర్థులు పోటీ చేసినా… రెండు మదపుటేనుగుల మధ్య నలిగిపోవడం ఖాయమనే కామెంట్లూ వినిపిస్తుంటాయి.

ఈసారి ఇక్కడ గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. గతంలో ఆర్.ఆర్.ఆర్. గెలుపులో జగన్ దే కీలకపాత్ర అని సాటిచెప్పాలని బలంగా పరితపిస్తుంది వైసీపీ. మరి ఈ సమయంలో ట్రిపుల్ ఆర్ ఎలాంటి ఎత్తులు వేస్తారు.. వాటిని వైసీపీతో కలిసి గాదిరాజు సుబ్బరాజు ఎలా చిత్తు చేస్తారు అనేది వేచి చూడాలి!