పర్చూరులో జెండా ఎగరేసేదెవరు ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరూ అలాగే అనుకుంటున్నారు. చాలా కాలం తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్నికల రంగంలోకి ప్రత్యక్షంగా దిగటం ఇక్కడ విశేషం. అదే సమయంలో టిడిపి తరపున సిట్టింగ్ ఎంఎల్ఏ ఏలూరి సాంబశివరావు పోటీ చేస్తున్నారు. అంటే రాబోయే ఎన్నికల్లో టిడిపి తరపున ఏలూరి వైసిపి తరపున దగ్గుబటి పోటీలో ఉన్నారు. దాంతో ఇద్దరి మధ్య పోటీ రసవత్తరంగా జరుగుతోంది.

దగ్గుబాటి క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకుని పదేళ్ళయ్యింది. 2009లో కాంగ్రెస్ తరపున గెలిచిన దగ్గుబాటి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఏలూరి విషయానికి వస్తే మొదటిసారి పోటీ చేసింది పోయిన ఎన్నికల్లోనే.  ఇద్దరికీ నియోజకవర్గంలో పట్టుంది కానీ ఇద్దరు కూడా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావటమే ఏలూరికి ఇబ్బందిగా తయారైంది.

నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సింది దగ్గుబాటి  కాదు.  దగ్గుబాటి కొడుకు హితేష్ చెంచురామ్ కు అమెరికా పౌరసత్వం రద్దు కాలేదు కాబట్టి సాంకేతికంగా పోటీకి అనర్హుడయ్యాడు. దాంతో తప్పని పరిస్దితుల్లో దగ్గుబాటే రంగంలోకి దిగాల్సొచ్చింది. ఈ నియోజకవర్గంలో కమ్మ వాళ్ళదే రాజకీయ ఆధిపత్యం కొనసాగుతోంది.

దగ్గుబాటికి జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిచయాలు, సౌమ్యునిగా ఉన్న పేరు, కమ్మోళ్ళల్లో పెద్ద మనిషిగా ఉన్న గుడ్ విల్, ఎన్టీయార్ అల్లుడవటం లాంటి అనేక అంశాలు ప్లస్ పాయింట్లయ్యాయి. వాటన్నికితోడు జగన్మోహన్ రెడ్డి మీదున్న క్రేజ్, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తాయని అంటున్నారు. అదే సమయంలో ఏలూరిపై అవినీతి ఆరోపణలకు తోడు జనాలకు అసలు అందుబాటులో ఉండడనే అపఖ్యాతి కూడా ఉంది. కాబట్టి ఇక్కడ దగ్గుబాటి గెలవటానికే ఎక్కువ అవకాశాలున్నాయనేది సమాచారం.