మూడో ఎంఎల్సీ వైసిపిలో ఎవరికో ?

తొందరలో భర్తీ అయ్యే మూడు ఎంఎల్సీల్లో మూడో అవకాశం ఎవరికి వస్తుందో అన్న సస్పెన్స్ పెరిగిపోతోంది.  మొన్నటి ఎన్నికల్లో ఐదు ఎంఎల్సీ పదవులు ఖాళీ అయ్యాయి. ఇందులో రెండు స్ధానిక సంస్ధలకు చెందినవైతే మిగిలిన మూడు ఎంఎల్ఏల కోటాలో భర్తీ అవ్వాల్సినవి.

సంఖ్య రీత్యా మూడు ఎంఎల్సీ పదవులూ వైసిపికే దక్కుతాయనటంలో సందేహం లేదు. మిగిలిన రెండు మాత్రం స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ తర్వాత కానీ భర్తీ అయ్యే అవకాశం లేదు. అందుకనే ముందుగా మూడు స్ధానాలను జగన్మోహన్ రెడ్డి తొందరలో మొదలవ్వబోయే బడ్జెట్ సమావేశల్లోనే భర్తీ చేస్తారని అనుకుంటున్నారు.

ఈ మూడు స్ధానాల్లో ఒకటి మంత్రి మోపిదేవి వెంకటరమణకు దక్కటం ఖాయం. ఎందుకంటే ఉభయ సభల్లో ఎందులోను సభ్యుడు కాకపోయినా మోపిదేవిని జగన్ మంత్రిని చేశారు కాబట్టి ముందు ఓ స్ధానంలో మంత్రిని ఎంపిక చేయాలి. ఇక రెండో స్ధానంలో మొహ్మద్ ఇక్బాల్ ను ఎంపిక చేయటం ఖాయమనే పార్టీ వర్గాలంటున్నాయి.

మొన్నటి రంజాన్ సందర్భంగా గుంటూరులో జగన్ మాట్లాడుతూ హిందుపురంలో పోటీ చేసి ఓడిపోయిన ఇక్బాల్ ను ఎంఎల్సీని చేస్తానని బహిరంగంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాబట్టి రెండు స్ధానాల్లో ఇద్దరు అభ్యర్ధులు దాదాపు ఖాయమనే అనుకోవాలి. ఇక మూడో స్ధానంలో ఎవరిని ఎంపిక చేస్తారన్నదే సస్పెన్సుగా మారింది.