కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ దాదాగిరీ చేస్తోందనీ, కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వంతపాడుతూ తెలంగాణకి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందనీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాగార్జున సాగర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. కేసీయార్ వ్యాఖ్యలపై, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. దాదాగిరీ అంటే, క్లిష్ట సమయంలో కృష్ణా నది నుంచి విద్యుదుత్పత్తి పేరుతో వృధాగా సముద్రంలోకి 30 టీఎంసీల నీళ్ళను పంపించేయడమే కదా.? అంటూ సజ్జల సెటైర్ వేశారు. తెలంగాణ రాష్ట్రమే కృష్ణా నది నీటి విషయంలో దాదాగిరీ చేసిందన్న సజ్జల.. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించి, కేంద్రానికి ఫిర్యాదు చేసిందని చెప్పుకొచ్చారు.
కేంద్రం ఆదేశాల్నిగానీ, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఆదేశాల్నిగానీ తెలంగాణ పట్టించుకోలేదనీ సజ్జల వ్యాఖ్యానించారు. ఇదిలా వుంటే, కొద్ది రోజుల క్రితం, తెలంగాణ ప్రభుత్వం.. శ్రీశైలం, నాగార్జున సాగర్ అలాగే పులిచింతల ప్రాజెక్టుల నుంచి ఆంధ్రప్రదేశ్ అనుమతి లేకుండానే జల విద్యుదుత్పత్తి చేసి, తద్వారా విలువైన నీటిని సముద్రంలోకి వృధాగా వదిలేసిన విషయం విదితమే. ఈ విషయమై పెను రాజకీయ దుమారం రేగింది. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి ‘నీళ్ళ దొంగ..’ అనీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి గజ దొంగ అనీ.. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు విరుచుకుపడిపోయారు. అయితే, కేంద్రం జోక్యం చేసుకోవడం, బోర్డులకు సంబంధించి గెజిట్ జారీ అవడం, మరోపక్క, ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో వివాదం కొంతమేర సద్దుమణిగినట్లయ్యింది. ఇంతలోనే కేసీయార్, ‘దాదాగిరీ’ అంటూ ఏపీ మీద విరుచుకుపడ్డంతో వివాదం మళ్ళీ మొదటికొచ్చినట్లయ్యింది.