కారులో మృతదేహం: వైసీపీ ఎమ్మెల్సీ వెనుక వున్నదెవరు.?

తన వ్యక్తిగత రహస్యాల్ని బయటపెడతానంటూ బెదిరించడం వల్లే తన మాజీ కారు డ్రైవర్‌ని చంపేసినట్లు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసుల యెదుట నేరం అంగీకరించాడట. అలాగని మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రజల నుంచీ, ప్రజా సంఘాల నుంచీ, రాజకీయ పార్టీల నుంచీ, బాధిత కుటుంబం నుంచీ ఒత్తిడి పెరగడంతో, ఎట్టకేలకు పోలీసులు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టుని ప్రకటించారు.

విపక్షాలకు చెందిన నాయకులెవరిపైన అయినా ఆరోపణలు వస్తేనే, వెంటనే అరెస్టుల పర్వం షురూ అవుతుంది. గతంలో మంత్రిగా పని చేసిన పేర్ని నాని అనుచరుడి హత్య విషయంలో మాజీ మంత్రి ఒకర్ని ఇలాగే పోలీసులు అత్యంత వేగంగా, అత్యంత చాకచక్యంగా అరెస్టు చేసిన విషయం విదితమే.

‘నిబంధనలు పాటించలేదు..’ అని అప్పట్లో పోలీసులపై చాలా విమర్శలు వినిపించాయి. సరే, పోలీసు శాఖ ఎవరు అధికారంలో వుంటే ఎలా పని చేస్తుంది.? అన్నది వేరే చర్చ. ‘తప్పు చేయలేదనే ధైర్యంతోనే.. భయం లేకుండా జనంలో తిరుగుతున్నట్టున్నాడు..’ అంటూ తమ ఎమ్మెల్సీ గురించి మంత్రి బొత్స చెప్పుకొచ్చారు.

మరి, ఆ ఎమ్మెల్సీ ఇప్పుడెందుకు లొంగిపోయినట్టు.? తప్పు చేశాననే భయం బహుశా ఆయనలో ఇప్పుడు కలిగి వుండొచ్చేమో. హత్య కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి. కానీ, ‘ఆ విషయంపై తర్వాత నిర్ణయం తీసుకుంటాం..’ అని మంత్రి బొత్స చెప్పుకొచ్చారు తాజాగా.

అరెస్టుకు సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేసి, అరెస్టుని ధృవీకరిస్తారట పోలీసులు. అయితే, ఈలోగా ప్రభుత్వానికి చాలా డ్యామేజీనే జరిగిపోయింది. అధికార పార్టీకి సైతం ఇంతలా డ్యామేజీ జరిగే పరిస్థితి వచ్చిందంటే, అసలు ఎమ్మెల్సీ అనంతబాబు వెనుక వున్న ‘శక్తి’ ఏంటి.?