గోరంట్ల వీడియో లీక్ వెనుక వున్నదెవరు.?

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో క్లిప్ వ్యవహారం. ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడారన్నది గోరంట్ల మాధవ్ మీద వచ్చిన అభియోగం. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

తూచ్.. అది తన వీడియో కాదంటూ గోరంట్ల మాధవ్ వివరణ ఇచ్చారు. అంతే కాదు, తాను జిమ్ చేస్తున్నప్పటి వీడియోను ఎవరో మార్ఫింగ్ చేశారన్నది గోరంట్ల మాధవ్ ఆరోపణ. సైబర్ క్రైమ్‌కి ఆల్రెడీ ఫిర్యాదు చేశాననీ, నిజాలు నిగ్గు తేలేవరకూ ఊరుకునే ప్రసక్తే లేదని గోరంట్ల మాధవ్ తనదైన స్టయిల్లో మీడియా ముందు హంగామా చేశారు.

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. మార్ఫింగ్ వీడియోలు చేసెయ్యడం పెద్ద కష్టమేమీ కాదు. సెలబ్రిటీల మార్ఫింగ్ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా కనిపిస్తుంటాయి. కొన్ని అచ్చం ఒరిజినల్ అనేలా వుంటాయి. చాలావరకు ఫేక్ వీడియోలని తేలిపోతాయ్.

ఇంతకీ, గోరంట్ల మాధవ్ వీడియో ఏ రకానికి చెందినది.? అంటే, ఇక్కడ నిజాన్ని నిగ్గు తేల్చడం అంత తేలిక కాకపోవచ్చు. పోలీసులకు ఫిర్యాదు చేశానంటున్నారు గనుక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో వున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే గనుక, తమ ఎంపీకి జరుగుతున్న అవమానంపై, స్పందించాల్సిన రీతిలో స్పందించి.. ఎవరైతే మార్ఫింగ్ వీడియో రూపొందించారో వాళ్ళను గుర్తించి శిక్షించాల్సిందే.
లేని పక్షంలో జనంలోకి తప్పుడు సంకేతాలు ఖచ్చితంగా వెళతాయ్.!