పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకూ మోడి-జగన్ ఒకటే అంటూ బురదచల్లుతుంటారు చంద్రబాబానాయుడు. మోడి పాల్గొన్న బహిరంగ సభలకు వైసిపినే జనాలను పంపిందని మండిపడుతుంటారు. టిడిపికి ఎంఎల్ఏలు, ఎంపిలు రాజీనామాలు చేయటంలో కూడా మోడి, జగన్ ధ్వయమే కుట్రలు పన్నుతున్నారని ఒకటే ఊదరగొడుతుంటారు.
సీన్ కట్ చేస్తే మోడి ప్రధానమంత్రిగా రాజీనామా చేయాలని తాజాగా డిమాండ్ చేస్తున్నారు. పుల్వామాలో 43 మంది సైనికుల మరణానికి మోడినే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాగైనా సరే మోడి, జగన్ ఒకటే అని, వారిద్దరే రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని జనాలను నమ్మించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. చివరకు నేతలతో రోజువారి టెలికాన్ఫరెన్సుల్లో కూడా మోడి, జగన్ ల జపం తప్ప మరోటి వినబడటం లేదు.
సరే అంతా బాగానే ఉంది. మరి పై ఫొటో చూసిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది. ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాకు ఉపరాష్ట్రపతి రాక సందర్భంగా టిడిపి మంత్రులు, నేతలు స్వాగతం చెబుతూ భారీ వినైల్స్ ఏర్పాటు చేశారు. ఆ వినైల్లో ఎడమవైపు వెంకయ్యనాయుడు ఫొటో ఉంది. కుడివైపు క్టోజప్ లో అంతకన్నా పెద్ద ఫొటో చంద్రబాబుది కనబడుతోంది.
అదే వినైల్లో పైన మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పి. నారాయణలు కనబడుతున్నారు. వినైల్ లో టిడిపి నేత కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఫొటో కూడా ఉంది. వెంకయ్యనాయుడు అంటే బిజెపి నేతే అని కొత్తగా ఎవరికి పరిచయం చేయాల్సిన పనిలేదు. మరి వెంకయ్య వస్తుంటే స్వాగతం చెప్పిందెవరు ? వైసిపినా లేకపోతే టిడిపినా ? ఉపరాష్ట్రపతి వస్తున్నారు కాబట్టి స్వాగతం చెప్పటం ధర్మమని టిడిపి సమర్ధించుకున్నా మరి మొన్న గుంటూరుకు ప్రధానమంత్రి వచ్చినపుడు చంద్రబాబు వెళ్ళని విషయం గుర్తుంటుందా ?