ఐదురోజులుగా రెండు రాష్ట్రాలను కుదిపేస్తున్న డేటాచోరీ స్కాంలో కొత్త ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అధికారపార్టీ ఒకలాగ, ప్రభుత్వ ఉన్నతాధికారులు మరొకలాగ మాట్లాడుతుండటంతో అందరిలోను అయోమయం మొదలైంది. తెలుగుదేశంపార్టీ డేటాను తెలంగాణా ప్రభుత్వం చోరి చేసిందని మంత్రులు ఎన్నికల కమీషనర్ తో పాటు గుంటూరు ఎస్పీ దగ్గర కూడా ఫిర్యాదు చేశారు.
అదే సమయంలో తమ సర్వర్లలో ఉన్న డేటా ఏదీ చోరికి గురికాలేదని, భద్రంగానే ఉందని ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్ మీడియా సమావేశంలో స్పష్టంగా చెప్పారు. వైసిపిఏమో 3.5 కోట్లమంది ప్రజల వ్యక్తిగత వివరాలను ఏపి ప్రభుత్వం అప్పనంగా ఐటి గ్రిడ్ సాఫ్ట్ వేర్ అనే కంపెనీకి కట్టబెట్టేసిందని ఆరోపణలు చేస్తోంది. ఈ మొత్తంలో ఎవరు చెప్పేది నిజం ? ఎవరు అబద్ధాలు చెబుతున్నారు ? అన్నదే సామాన్యులను అయోమయానికి గురిచేస్తోంది.
తెలంగాణాలో పోలీసులేమో ఏపి ప్రజల వ్యక్తిగత వివరాలు సాఫ్ట్ వేర్ కంపెనీ దగ్గర దొరికిందని స్పష్టంగా ప్రకటించారు. అంటే వైసిపి వాదననే తెలంగాణా పోలీసులు కూడా సమర్ధించారు. మరి మంత్రులిచ్చిన ఫిర్యాదు, ఐటి ముఖ్య కార్యదర్శి చేసిన ప్రకటన మాటేమిటి ? ఏమిటంటే, జనాలను అయోమయానికి గురిచేయటంలో చంద్రబాబునాయుడు సక్సెస్ అయ్యారు.
తప్పుడు పనులు చేయటం ఆ క్రమంలో దొరికిపోతే ఎదురుదాడి చేయటమన్నది చంద్రబాబుకు బాగా అలవాటే. ఓటుకునోటు కేసులో కూడా ఇలాగే కాలం నెట్టుకొస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. చూద్దాం ఈ కేసును కూడా చంద్రబాబు ఎంతకాలం లాగుతారో ?