నారాయణ నారాయణ.. ఎక్కడున్నావ్.? ఏం చేస్తున్నావ్.?

Ex Minister Narayana TDP

Ex Minister Narayana TDP

చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన ‘నెంబర్ టూ’ హోదాలో పనిచేశారు. రాజధాని అమరావతి అంటే చంద్రబాబు కూడా కాదు, ఆ సమయంలో అన్ని వ్యవహారాలూ చక్కబెట్టింది ఆయనగారే. ఆయనెవరో కాదు మాజీ మంత్రి నారాయణ. రాజకీయాల్లో అస్సలేమాత్రం అనుభవం లేని నారాయణకు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి, కీలకమైన మంత్రి పదవి ఇచ్చేశారు చంద్రబాబు.

తన ఆలోచనలన్నిటినీ నారాయణ ద్వారా అమల్లో పెట్టేవారు చంద్రబాబు. అప్పట్లో మంత్రి నారాయణ మీడియా ముందు కనబడని రోజు లేదు అమరావతికి సంబంధించి. ఎప్పుడైతే టీడీపీ అధికారం కోల్పోయిందో, ఆ తర్వాత నారాయణ పెద్దగా రాజకీయాల్లో కనిపించలేదు. అసలు టీడీపీలోనే ఆయన వున్నారా.? లేదా.? అన్నదానిపై టీడీపీ నేతలకూ సరైన సమాచారం లేదు. అమరావతి రగడ తెరపైకొచ్చిన ప్రతిసారీ ‘నారాయణ దోపిడీ’ అనే వాదన వినిపిస్తుంటుంది.

అమరావతి కుంభకోణానికి సంబంధించి తాజాగా సీఐడీ జారీ చేసిన నోటీసుల్లో చంద్రబాబు పేరు తొలుత వుంటే, రెండో పేరు నారాయణదే కావడం గమనార్హం. నారాయణకూ సీఐడీ నోటీసులు అందాయి. మరి, నారాయణ మీడియా ముందుకు రాలేదేం.? అమరావతి గురించి ఆయన 2019 ఎన్నికల తర్వాత గట్టిగా మాట్లాడలేదేం.? పంచాయితీ, మునిసిపల్ ఎన్నికల సమయంలో కూడా ఈ మాజీ మంత్రి ఎందుకు కనిపించలేదు.? ఏమోగానీ, ఇప్పుడు నారాయణ మీడియా ముందుకు వచ్చి తీరాల్సిందే. అమరావతిలో ఏం జరిగిందో టీడీపీలోనే చాలామందికి తెలియదు. అంతలా నారాయణను అడ్డం పెట్టుకుని వ్యవహారాలన్నీ చంద్రబాబే చక్కబెట్టేశారు. అంతర్జాతీయ స్థాయి రాజధాని అన్నారు, ఏవేవో కబుర్లు చెప్పారు. ఇప్పుడేమో ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణం అమరావతి.. అనే స్థాయి ఆరోపణలు వస్తున్నాయ్. నారాయణగారూ కాస్త మీడియా ముందుకొచ్చి వివరణ ఇద్దురూ.!