నో డౌట్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నమే అతి పెద్ద నగరం. భిన్న సంస్కృతుల్ని విశాఖపట్నంలోనే చూడగలం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనూ హైద్రాబాద్ తర్వాత ఆ స్థాయి వున్న నగరం ఏదంటే విశాఖ మాత్రమే అన్న చర్చ జరిగేది.
విశాఖ ప్రకృతి అందాలకు నెలవు. పలు కేంద్ర సంస్థలూ ఇక్కడ కొలువుదీరి వున్నాయి. పారిశ్రామికీకరణ బాగానే జరిగిన ప్రాంతం. అయితే, నగర విస్తరణ అంత తేలిక కాదు.! అదొక్కటే ఇక్కడ పెద్ద సమస్య. కానీ, ప్రభుత్వ భూములు బాగానే వున్నాయ్.
అందుకే, విశాఖపట్నం నగరం, ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక రాజధాని అయ్యే అర్హతను సంపాదించుకుంది. దురదృష్టం అప్పట్లో అమరావతి వైపు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మొగ్గు చూపారు. కొత్త ప్రాంతంలో రాజధాని కడితే, ఆ ఘనత తన ఖాతాలోకి వస్తుందని చంద్రబాబు భావించారు.
అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అయ్యింది. దాన్ని నచ్చని వైఎస్ జగన్, మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చారు.. తాను అధికారంలోకి వచ్చాక. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించారు. కోర్టు కేసుల పుణ్యమా అని మూడు రాజధానుల బిల్లు, కాలగర్భంలో కలిసిపోయింది.
టెక్నికల్‌గా చూస్తే, మూడు రాజధానులనే కాన్సెప్ట్ లైవ్‌గా లేదిప్పుడు. కానీ, విశాఖను కార్య నిర్వాహక రాజధానిగా వైసీపీ చెబుతోంది. డిసెంబర్‌లోనే విశాఖకు వైఎస్ జగన్.. అంటున్నారు. వాస్తవానికి గతంలోనూ పలు ముహూర్తాలు ప్రకటించి, చేతులు దులుపుకున్నారు.
ఇప్పటికైతే, విశాఖలో రాజధాని పేరుతో సందడేమీ లేదు.. అలజడి తప్ప.! ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. ఈలోగా రాజధాని విశాఖ అనేది అర్థం పర్థం లేని వ్యవహారమే. విశాఖ వాసులకీ ఈ విషయమై పూర్తిస్థాయి స్పష్టత వుంది.