విశాఖపట్నం జిల్లాలోని ఎస్ రాయవరం మండలం గుడివాడలోని రాజతోట రహస్యం గుట్టురట్టైంది. స్ధానిక టిడిపి నేత పేరిచర్ల శ్రీపతిరాజుకి వందలాది ఎకరాలుంది. అందులో జీడిమామిడి, బొప్పాయి, మామిడి, దానిమ్మకాయల తోటలున్నాయి. మొత్తం వ్యవసాయ క్షేత్రానికి చుట్టూరా సోలార్ ఫెన్సింగ్ తో భద్రత ఉంటుంది. అందులోనే అధునాతన సౌకర్యాలతో ఓ గెస్ట్ హౌసుంది. అందులో జరిగే వ్యవసాయం మొత్తం ఆడవాళ్ళే చేస్తారు. ఎక్కడా పొరపాటున కూడా మొగవాళ్ళు కనబడరు. ఉదయం నుండి సాయంత్రం వరకూ ఆడవాళ్ళు వ్యవసాయం చేసి వెళ్ళిపోతారు. రాత్రయితే తోటలకు కాపలాగ కుక్కలను వదిలేస్తారు. అందుకే ఎవరూ పొరబాటున కూడా వ్యవసాయ క్షేత్రంలోకి అడుగుపెట్టే సాహసం చేయటం లేదు.
ఈ విషయం ఆనాటో ఈనోట బాగా ప్రచారమైపోయింది. కేవలం ఆడవాళ్ళను మాత్రమే వ్యవసాయ పనులకు తీసుకుంటుండంతో అందరికీ అనుమానలు మొదలయ్యాయి. రాత్రుళ్ళయితే కుక్కలను వదిలేస్తుండటంతో తోటల్లో ఏం జరుగుతోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. స్ధానికులు అడగాలన్నా అవకాశం లేదు. ఎందుకంటే వ్యవసాయ క్షేత్రమంతా టిడిపి నేతది. మరి ఆ తోటలవైపు చూడటానికి పోలీసులకు ఎంత ధైర్యం? పోలీసులే తొంగిచూడలేనపుడు ఇక మామూలు వాళ్ళ పరిస్ధితేంటి ? రాజుగారిని ఎవరైనా కలవాలని తోటల దగ్గరకు వస్తే ఆయనే బయటకు వస్తారు కానీ పొరబాటున కూడా వారెవరినీ లోపలకు రానీయటం లేదు. అయితే, అప్పుడప్పుడు మాత్రం ఎవరో విఐపిలు తోటల్లోకి వచ్చి వెడుతున్నారట. దాంతో చుట్టుపక్కలంతా రాజగారి తోటలు పెద్ద చర్చనీయాంశమైపోయింది.
దాంతో విషయం తెలిసిన అటవీశాఖ ఉన్నతాధికారులు తోటలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అందులో పనిచేసే వారిని లైన్లో పెట్టిన తర్వాత అర్ధరాతి ఆకస్మికంగా తోటలపై దాడులు జరిపారు. దాంతో రాజుగారి తోటలోని అసలు గుట్టు బయటపడింది. అటవీ శాఖాధికారుల దాడుల్లో వన్యప్రాణులు నెమళ్ళు, కొండగొఱ్ఱెలు, కణుజులు, దుప్పులు పట్టుబడ్డాయి. అటవీ శాఖ, వన్యప్రాణుల చట్టం ప్రకారం పై ప్రాణులను పెంచుకోవటం నేరం. చట్ట విరుద్ధంగా వన్య ప్రాణులను పెంచుతున్నందుకు రాజుకి అటవీశాఖ నోటీసులిచ్చి కేసు నమోదు చేసింది. ఎప్పుడైతే అటవీ శాఖ ఉన్నతాధికారుతు ఫాం హౌస్ పై దాడి చేసి వన్యప్రాణులను పట్టుకున్నారని తెలియగానే రాజు మాయమైపోయారు. దాంతో రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తానికి ధైర్యం చేసి అటవీశాఖ ఉన్నతాధికారులు చేసిన దాడితో రాజుగారి తోట గుట్టు బయటపడింది.