చంద్రబాబునాయుడుతో పాటు మంత్రులు, టిడిపి నేతలు మాట్లాడుతున్నది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది అందరికి. పోలింగ్ అయిపోయింది. కాబట్టి ఓటర్ల తీర్పేమిటో రిజర్వయిపోయింది. మే 23వ తేదీన జడ్జిమెంట్ డే అన్నది అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని చంద్రబాబు మాట్లాడుతూ జూన్ 8వ తేదీ వరకూ తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటించేశారు.
అదేమిటయ్యా అంటే తనను ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు ఉండమని జనాలు 2014లో తీర్పిచ్చారు కాబట్టి వచ్చే జూన్ 8 వరకూ తానే ముఖ్యమంత్రిగా ఉంటానని గట్టిగా చెబుతున్నారు. సరే జడ్జిమెంట్ డే గురించి మాట్లాడుకుందాం. మే 23వ తేదీ కౌంటింగ్ లో వైసిపికి మెజారిటీ వచ్చిందని అనుకుందాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డే కదా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేది.
మెజారిటీ వచ్చింది కాబట్టి జాతకం ప్రకారం కావచ్చు ఇతరత్రా సమీకరణ వల్ల ఫలితాలు వచ్చిన మరునాడే అంటే మే 24వ తేదీనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటానంటే ఏమిటి పరిస్ధితి ? జూన్ 8 వ తేదీ వరకూ తానే సిఎం అంటూ కుర్చీ వదలకుండా కూర్చుంటారా చంద్రబాబు ? మే 24న ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారంచేసిన తర్వాత కూడా అంటే 15 రోజుల పాటు చంద్రబాబు సిఎంగా కొనసాగుతారా ?
23న ఫలితాల్లో టిడిపికి మెజారిటి రాకపోతే గవర్నర్ కు చంద్రబాబు రాజీనామా ఇచ్చేయాలి. అదే సమయంలో జగన్ ఎప్పుడు సిఎంగా ప్రమాణ స్వీకారం చేసేది గవర్నర్ కు చెబుతారు. కాబట్టి ఆ తేదీ వరకూ చంద్రబాబునే కేర్ టేకర్ సిఎంగా ఉండమని గవర్నర్ కోరుతారు. జగన్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే చంద్రబాబు మాజీ అయిపోతారు.
వాస్తవం ఇలాగుంటే చంద్రబాబు మాత్రం జూన్ 8 వరకూ తానే ముఖ్యమంత్రినంటూ చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు మంత్రులు, నేతలు వంత పాడుతున్నారు. మూడుసార్లు సిఎం అయిన చంద్రబాబుకు తెలీదా ప్రొసీజర్. తెలిసి కూడా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారంటే టిడిపి ఓడిపోతోందనే ప్రచారాన్ని తట్టుకోలేకున్నట్లు అర్ధమైపోతోంది.