నాలుగు వారాల తర్వాత ఏం జరగబోతోంది.?

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జైలు నుంచి విడుదలయ్యాక భారీ అభిమాన సందోహం నడుమ, రాజమండ్రి నుంచి విజయవాడకు పయమైన వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది.

అంతకు ముందు చంద్రబాబు, రాజమండ్రి జైలు వద్ద ప్రసంగించారు. తప్పు చేయననీ, తప్పుని ప్రోత్సహించననీ చంద్రబాబు చెప్పుకున్నారు. ఈ స్వకుచ మర్థనం రాజకీయాల్లో అందరూ చేసేదే. చంద్రరబాబు ఇంకాస్త ఎక్కువ చేశారంతే. చంద్రబాబు విడుదల పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.

మరోపక్క, వైసీపీ నేతలు ఎడా పెడా మీడియా ముందుకొచ్చేసి, చంద్రబాబుకి వచ్చింది జస్ట్ మద్యంతర బెయిల్ మాత్రమేననీ, ఆయనేమీ నిర్దోషిగా విడుదలవలేదనీ, ఇంత ఓవరాక్షన్ టీడీపీ చేయాల్సిన అవసరం లేదనీ మాట్లాడేశారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికీ బెయిల్ మీదనే వున్నారు అక్రమాస్తుల కేసుల్లో. బెయిల్ మీద వుండే, ఆయన పాదయాత్ర చేశారు, ముఖ్యమంత్రి పీఠమెక్కారు. షరతులతో కూడిన బెయిల్.. అని చంద్రబాబుని వైసీపీ వెటకారం చేయాల్సిన పనిలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా షరతులతో కూడిన బెయిల్ మీదనే వున్నారు. విదేశాలకు వైఎస్ జగన్ వెళ్ళాలంటే, న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకోవాల్సి వుంటుంది.

ఇక, వైఎస్ జగన్‌కి షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ లభిస్తే, చంద్రబాబుకి మద్యంతర బెయిల్ లభించింది. నాలుగు వారాల తర్వాత చంద్రబాబు, తిరిగి సరెండర్ అవ్వాలి. కానీ, ఈలోగానే, రెగ్యులర్ బెయిల్ వచ్చేస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆట ఇప్పుడే మొదలైందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెబుతుండడం గమనార్హం.

రాజకీయాల్లో ఇవే వ్యవస్థల పట్ల ప్రజల్లో చులకన భావానికి కారణమవుతాయి. రాజకీయ నాయకుల పట్ల ఏహ్యభావాన్నీ పెంచుతుంటాయ్.!