కన్నా లక్ష్మీనారాయణ సైకిల్ ఎక్కగానే… ఉమ్మడి గుంటూరుతో పాటు కృష్ణాజిల్లాలోనూ టీడీపీ గెలుపు అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉందని తమ్ముళ్లంతా బలంగా నమ్మారు! కన్నాను పార్టీలో చేర్చుకునే సమయంలో బాబు మాటలు విన్నవారు… కన్నాకు టీడీపీలో మాంచి పొజిషన్ కూడా దక్కబోతుందని భావించారు. కన్నా సేవలు కేవలం ఆయన పోటీచేయబోయే నియోజకవర్గానికే పరిమితం కాకుండా… ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం వినియోగించుకునేలా బాధ్యతలు ఇస్తారని ఆయన వర్గం జనాలు బలంగా నమ్మారు. అయితే… బాబు మరొకటి తలచారు!
ప్రస్తుతం టీడీపీలో కన్నా పరిస్థితి అత్యంత దయణీయంగా మారిందని చెబుతున్నారు పరిశీలకులు. కన్నా పసుపు కండువా కప్పుకుని మూడు నెలలు కావొస్తున్నా.. ఇప్పటికీ ఆయన స్థానం ఏమిటో ఆయనకు కూడా తెలియని పరిస్థితి. పార్టీలో పొజిషన్ లేదు.. ఆయన సేవలు వినియోగించుకునే ప్రణాళికలు వేస్తున్నట్లు కూడా కనిపించడం లేదు.. ఆఖరికి ఆయన పోటీచేయబోయే నియోజకవర్గం ఏదో కూడా బాబు ఇప్పటికీ చెప్పలేదు. దీంతో… కన్నాకు ఎలాంటి కర్మ పట్టుకుందని ఆఫ్ ద రికార్డ్ ఆయన అభిమానులు ఫీలవుతున్న పరిస్థితి.
పోనీ సత్తెనపల్లినో, పెదకూరపాడునో నమ్ముకుని పనిచేసుకుపోదామనుకుంటే… ఆ రెండు నియోజావర్గాల్లోనూ గత నాలుగేళ్లుగా పార్టీని కాపాడుతున్న బలమైన నేతలు ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఆఖరికి కొన్ని రోజుల ముందు సత్తెనపల్లిలో బాబు పర్యటించిన సందర్భంలో… ఆ వాహనంపై ఎక్కి బాబు పక్కన నిలబడే ఛాన్స్ కూడా కన్నాకు దక్కకుండా అడ్డుకోవడంలో వారు పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఇది బీజేపీని వదిలి సైకిల్ ఎక్కిన మాజీమంత్రి, సీనియర్ పొలిటీషియన్ కన్నా లక్ష్మీనారాయణకు బాబు ఇస్తున్న విలువ!
మరి ఈ పరిస్థితి ఇంకెంతకాలం నడుస్తుందో.. పార్టీలో నంబర్ 2 స్థానానికి ఎవరినీ ఎదగనివ్వరనే పేరు సంపాదించుకున్న బాబు… కన్నాకు ఎలాంటి విలువ ఇవ్వబోతున్నారో వేచి చూడాలి. ఈ సమయంలో… కన్నా సెకండ్ థాట్ కి వెళ్లే ఛాన్స్ లు సైతం లేకపోలేదనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. ఇందులో భాగంగా జనసేన నేతలు సైతం… కన్నాకు కన్నుకొడుతున్నారని తెలుస్తుంది!