ముఖ్యమంత్రి కెసిఆర్ ‘సండే స్పెషల్’ ఇదేనా?

కెసిఆర్ రేపు  ఏమి చేస్తారో తెలుసా?

ఆదివారం నాడు అట్ట హాసంగా జరగనున్న ప్రగతి నివేదిన సభ లో  ‘స్పెషల్ ’ ఏంటి?

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై సర్వత్రా తెగ ఉత్కఠ నెలకొంది. అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ఆదివారం నాడు కొంగర కలాన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి కూడా తెలిసిందే.ఈ సమావేశానికి ‘ప్రగతి నివేదన’ సభ అని పేరు పెట్టారు. ఈ మహామేలా కొన్ని గంటల ముందే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది.

ఎందుకు? దాని స్పెషాలిటి ఏమిటి? అనేది ఇపుడు ప్రశ్న.

ప్రగతి నివేదన సభకు ఒక రోజు ముందు లేదా ఒక రోజు తరువాత కేబినెట్‌ భేటీ నిర్వహించుకునే అవకాశం ఉంది. కెసిఆర్ ఏమి చేసినా గమ్మత్తుగానే ఉంటుంది.  అన్ని జిల్లాల నుంచి దాదాపు 25లక్షల మంది సమక్షంలో జరుగనున్న ఈ  బహిరంగ సభ ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఈ సమావేశం జరుగుతున్నది. అన్ని జిల్లాల నుంచేకాదు, అన్ని నియోజకవర్గాల నుంచి  కచ్చితంగా వేల సంఖ్యలో ప్రజలు వచ్చితీరాలని షరతు పెట్టి జనసమీకరణ చేస్తున్నారు. అంటే, కొంగర కలాన్ మినీ తెలంగాణ ప్రత్యక్షమవుతుందన్నమాట.

దీనితో  క్యాబినెట్ సమావేశానికి  రాజకీయ  ప్రాధాన్యత వచ్చింది.  దీనికి క్యాబినెట్ సమావేశానికి లింకేమిటనుకుంటున్నారు. దీనిమీద టిఆర్ ఎస్ లో కూడా ఆసక్తికరమయిన వూహాగానాలుసాగుతున్నాయి.

ఇలా ఎందుకు జరుగుతున్నదో చాలా మంది టిఆర్ ఎస్ నాయకులకు కూడా తెలియదు. (టిఆర్ ఎస్ నాయకులతో చర్చించి ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటారా ఏంటి.)అయితే, ఒక సీనియర్ నాయకుడు ఇలా వూహించారు.

‘‘ఈ భేటీలో శాసనసభను రద్దు చేస్తూ తీర్మానం చేయవచ్చు. డిసెంబర్‌లో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంతోపాటు తెలంగాణకు ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ ఒక తీర్మానం ఉంటుంది.   మంత్రివర్గ సమావేశానికి చాలా పెద్ద  ఎజెండా ఉన్నాలసలు విషయం శాసన సభ రద్దు మాత్రమే. ఈ తీర్మానం క్యాబినెట్ ఆమోదం పొందాక ముఖ్యమంత్రి సభకు వస్తారు. సభలో ప్రజల ముందు అసెంబ్లీ రద్దు గురించి చెబుతారు. ఆమోదించమని కోరతారు. జనం చప్పట్లు కొడతారు. ఈలలు వేస్తారు. చేతులెత్తి ఒకె అంటారు. రాష్ట్రప్రభుత్వం నిర్ణయానికి జనామోదం కూడా ఉందని  ప్రకటన చేస్తారు. సభ తర్వాతనో మరుసటి రోజో గవర్నర్ ను కలుసుకుని క్యాబినెట్ నిర్ణయం గురించి, దానికి లభించిన తెలంగాణ ప్రజల ఆమోదం గురించి వివరిస్తారు.’’ అని ఈ నాయకుడు చెప్పారు.

ముఖ్యమంత్రి  ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడో అని ఆత్రంగా ఎదురుచూస్తున్నవాళ్లలో టిడిపి, కాంగ్రెస్, వామపక్షాలు, తెలంగాణ జనసమితి వంటి పార్టీ నేతలే కాదు, టిఆర్ ఎస్ నాయకులు కూడా అన్నారు. వారుకూడా అంతే  ఉత్కంఠతో ఉన్నారు.